హెడ్లీ అసలు షికాగోలోనే లేడు!
26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీ (58) ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటూ వచ్చిన వార్తలను అతడి లాయర్ జాన్ థెయిస్ ఖండించారు. ఈ వార్తలన్నీ అవాస్తవాలని, డేవిడ్ హెడ్లీ షికాగో జైలులో గానీ, ఆస్పత్రిలో గానీ లేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెడ్లీతో కాంటాక్ట్లోనే ఉన్నానన్న జాన్, హెడ్లీ ఎక్కడున్నాడో మాత్రం చెప్పలేనన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తోటి ఖైదీల చేతిలో గాయపడిన హెడ్లీ పరిస్థితి విషమంగా ఉందంటూ భారత మీడియాలో వచ్చిన కథనాలు నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ విషయం గురించి స్పందించేందుకు కెన్నెత్ జస్టర్ (భారత్లో అమెరికా రాయబారి) నిరాకరించారు.













