జాక్ పాట్ కొట్టిన అమెరికా దంపతులు
అమెరికాలోని లూసియానాకు చెందిన దంపతులకు అనుకోకుండా జాక్పాట్ తగిలింది. ఎప్పుడో కొని వదిలేసిన లాటరీ టికెట్ వాళ్లకు కోట్ల రూపాయలు తెచ్చి పెట్టింది. హార్లోడ్, టీనా ఎహ్రెన్బర్గ్ దంపతులకు 1.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.12 కోట్లు) లాటరీలో వచ్చాయి. జూన్ 6న జరిగిన లాటరీ లోటో డ్రాలో వీరిని అదృష్టం వరించింది. అయితే వారికి కొద్ది రోజుల క్రితం వరకు అసలు లాటరీ వచ్చిన సంగతే తెలియదు. ఇటీవల ఓ సెలవు రోజున వారు ఇల్లు శుభ్రం చేస్తుండగా స్టాండ్లో కొన్ని చూడకుండా వదిలేసిన లాటరీ టికెట్లు కనిపించాయి. దీంతో వాళ్లు ఆ లాటరీలను సంబంధిత లాటరీలకు చెందిన వెబ్సైట్లలో పరిశీలించారు.
వారి వద్ద ఉన్న టికెట్లలోని ఓ టికెట్లో అన్ని నంబర్లు లోటో డ్రాలో లాటరీ గెలిచిన నంబరుతో సరిపోవడంతో ఇక ఆ దంపతులకు ఆనందానికి అవధులు లేవు. లాటరీ బహుబతి డబ్బు తీసుకోవడానికి కేవలం రెండు వారాల సమయం మిగిలి ఉందనగా హార్లోడా, టీనా దంపతులు తమకు ఆ లాటరి వచ్చిన సంగతి తెలుసుకున్నారు. దీంతో వెంటనే సదరు లాటరీ యజమానులను సంప్రదించిన తమకు రావాల్సిన డబ్బును తీసుకున్నారు. అన్ని రకాల పన్నులు పోయిన తర్వాత వారికి 12,74,313 డాలర్ల సొమ్ము అందింది. ఈ డబ్బును వారు రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం దాచుకుంటారట. ఏమీ కొనే ఆలోచన లేదని పర్యటనకు వెళ్లే ప్రణాళికలు లేవని తెలిపారు.













