అమెరికాలో తెలుగు యువతి మృతి కేసు..
రహదారి దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొనడంతో కొద్దినెలల క్రితం అమెరికాలో భారతకు చెందిన యువతి మృతి చెందారు. ఆ ఘటన గురించి ఓ పోలీసు అధికారి జోకులు వేసుకుంటూ, నవ్వుతూ మాట్లాడారు. ఆ మాటలన్నీ అతడి బాడీకామ్ రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు వెలుగులోకి రావడంతో అతడి తీరుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి (23) డిగ్రీ తర్వాత పై చదువుల కోసం 2021 సెప్టెంబరు 20న అమెరికా వెళ్లారు. ఈ జనవరిలో కళాశాలకు వెళ్లి వస్తుండగా రహదారి దాటుతున్న సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం జాహ్నవిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు.
కాగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోన్న దృశ్యాల్లో పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ ఈ కేసు దర్యాప్తు గురించి మాట్లాడటం వినిపించింది. ఆమె ఒక సాధారణ వ్యక్తి అంటూ ఈ మరణానికి విలువలేనట్టుగా మాట్లాడారు. ఆ సమయంలో పగలబడి నవ్వారు. ఈ వీడియోపై సియాటిల్ కమ్యూనిటీ పోలీసు కమిషన్ (సీపీసీ) తీవ్రంగా పరిగణించింది. డేనియల్, అతడి సహోద్యోగి మధ్య జరిగిన సంభాషణ దిగ్భ్రాంతి కలిగించిందని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది.













