భారత్, అమెరికా కలసి పనిచేయాలి
సైబర్ సెక్యూరిటీపై భారత్, అమెరికా దేశాలు కలసి పనిచేయాలని అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్మ్యాన్ ఆకాంక్షించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయని, ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఈ భాగస్వామ్యం చాలా కీలకమన్నారు. తెలంగాణ ప్రభుత్వం, వెరిజాన్ బిజినెస్ గ్రూప్ ఇండియా విభాగం, హైదరాబాద్ సెక్యూరిటీ క్లస్టర్లు సంయుక్తంగా సిద్ధం చేసిన డేటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన వెబినార్‌లో రీఫ్మ్యాన్ మాట్లాడారు. కోవిడ్ కాలంలో డిజిటల్ కార్యకలాపాలు పెరిగిపోయాయని, దాంతోపాటే ర్యాన్సమ్వేర్, మాల్వేర్లకు సంబంధించిన ఘటనలూ ఎక్కువ అవుతున్నాయన్నారు.
రష్యా హ్యాకర్లు వ్యాక్సిన్ వివరాల చోరీకి ప్రయత్నిస్తుంటే, కొరియా ఆర్థిక వివరాలు, చైనా మేథో సంపత్తి హక్కులు, ఇతర రహస్యాలను లాగేందుకు తప్పుడే మార్గాలను ఎంచుకుంటున్నాయన్నారు. ఈ ముప్పులన్నింటినీ ఎదుర్కోవాలంటే భారత్, అమెరికాలు సైబర్ సెక్యూరిటీ అంశంలో పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవలని చెప్పారు. ఇందుకోసమే తాము ఈ ఏడాది సెప్టెంబరులో ఓ చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. హువాయి, జెడ్‌టీఈ వంటి సంస్థలు 5జీ టెక్నాలజీ అమలులో కీలకంగా ఉండటం అంత మంచిది కాదని, బ్రిటన్ తరహాలోనే భారత్ కూడా 5జీ అమలులో హువాయి పాత్రను తొలగించాలని సూచించారు.













