అమెరికా బెదిరింపులకు భయపడం
తమ చమురు ఎగుమతులను అడ్డుకుంటామంటున్న అమెరికా బెదిరింపులకు తమ ప్రభుత్వం భయపడదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రొహనీ సృష్టం చేశారు. ఇరాన్ రేడియోలో ఆయన ప్రసంగించారు. ట్రంప్ సర్కార్ తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇరాన్‌పై అమెరికా వైఖరి మార్చుకోకపోతే దీని పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ చమురు ఎగుమతి చేయలేదన్న ఆలోచనే వద్దని ఆయన అమెరికాకు సృష్టం చేశారు. అయితే అమెరికా ఎదుర్కొనే పర్యవసానాలేమిటన్న అంశాన్ని మాత్రం రౌహానీ వివరించలేదు. ఇరాన్ ఆటోమోటివ్, ఎయిర్ నాటికల్, బ్యాంకింగ్ రంగాలకు వ్యతిరేకంగా అమెరికా విధించిన తొలి విడత ఆంక్షలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. మలిదశలో విద్యుత్, తదితర రంగాలపై విధించే ఆంక్షలు నవంబర్ 5 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే రష్యా, చైనా, టర్కీ వంటి దేశాలు అమెరికా ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఇరాన్‌తో తమ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించాయి.













