1000 మంది చైనీయుల వీసాలను రద్దు చేసిన అమెరికా
చైనాపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా చైనీయుల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా ప్రకటించింది. భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. మే నెలలో అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఆధారంగా ఈ వీసాల రద్దు చేసినట్లు పేర్కొంది. చైనా నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థులు, పరిశోధకులకు చైనా మిలటరీతో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వారు అమెరికాకు చెందిన సమచారాన్ని తస్కరించకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ చాడ్ వోల్ఫ్ వెల్లడించారు. చట్టవ్యతిరేక వ్యాపార పద్ధతులు, గూఢచార్యం పేరుతో అమెరికా మేథో సంపత్తితోపాటు కరోనా వైరస్ పరిశోధనా సమచారాన్ని తస్కరించేందుకు విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని చాడ్ వోల్ఫ్ మరోసారి ఆరోపించారు.













