అమెరికా కీలక నిర్ణయం
కరోనా కల్లోలంతో విలవిల్లాడుతున్న అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఔషధ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ కు చెందిన రెమ్డిసివిర్ ఔషధాన్ని మొత్తం కొనుగొలు చేసింది. మూడునెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కానున్న మొత్తం మందును అమెరికా సొంతం చేసుకుంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా కావాల్సిన రెమ్డిసివిర్ ఔషధాన్ని తమకే విక్రయించాల్సిందిగా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకుందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి అలెక్స్ అజార్ ప్రకటించారు. సుమారు 5 లక్షలకు పైగా డోస్‌ల కొనుగోలుకు గిలియడ్‌తో డీల్ కుదిరినట్టు చెప్పారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలతో తయారయ్యే 90 శాతం రెమిడిసివిర్ ఔషధం అమెరికాకు దక్కనుందన్నారు. తద్వారా అమెరికాలో అవసరమైన ప్రతి కరోనా రోగికి ఈ ఔషధం అందుబాటులో ఉంటుందన్నారు. కరోనా మహమ్మారి నుంచి అమెరికా ప్రజలను రక్షించేందుకు శక్తివంచన లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆజార్ వెల్లడించారు. కాగా కోవిడ్ 19 చికిత్సకు గాను అమెరికాలో లైసెన్సింగ్ అధికారులు ఆమోదించిన మొట్టమొదటి ఔషధం రెమ్‌డెసివిర్.













