అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో మనవాళ్ళు
అమెరికాలో స్థిరపడిన భారతీయులు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. రాజకీయ రంగంలో కూడా తమ హవాను చాటేందుకు ప్రతిసారీ ప్రయత్నిస్తున్నారు. ఈసారి నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఏకంగా 20మంది అమెరికా కాంగ్రెస్‌కు పోటీ చేయడానికి సంసిద్ధులయ్యారు. ఈ ఏడాది అమెరికా కాంగ్రెస్ ఎన్నికల బరిలో రికార్డు స్థాయిలో భారత సంతతికి చెందిన 20 మంది పోటీ చేయడంతోపాటు తమ ప్రచారానికి వారంతా కలిసి 1,55,00,000 డాలర్లను సమీకరించారు. వీరిలో పది లక్షల డాలర్లకు మించి సమీకరించినవారు ఏడుగురు ఉన్నారు. ఇతర దేశాల సంతతి అమెరికాలో ఎన్నికల ప్రచారానికి ఇంత పెద్దమొత్తంలో నిధులు సమీకరించడంలో మనవాళ్ళే రికార్డు నెలకొల్పారు.
ఇల్లినాయిసలోని 8వ జిల్లా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మరోసారి ఎన్నికల బరిలో నిల్చి భారీమొత్తంలో 35 లక్షల డాలర్లు సమీకరించారు. ఆయనపై భారత సంతతికే చెందిన జితేందర్ దిగాన్కర్ పోటీ చేస్తున్నారు. మస్సాచుసెట్స్ నుంచి సెనేట్‌కు స్వతంత్ర అభ్యర్థిగా శివ అయ్యదురై పోటీ చేస్తున్నారు. మరో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ఆర్వో ఖన్నా, డాక్టర్ అమీ బెరా, ప్రమీలా జయపాల్ ఒక్కొక్కరూ 10 లక్షల డాలర్లకు మించి సమీకరించారు. ఇప్పటికే సభ్యులైన.. ఖన్నా, అమీ బెరా, ప్రమీలా మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో దిగారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జూన్‌లో నిర్వహించే ప్రైమరీలో ఒమర్ వైద్, మోహన్ రాధాక ష్ణన్ పోటీలో ఉన్నారు.













