నిక్కీ రాజీనామా వెనుక…?
భారత సంతతికి చెందిన భారత అమెరికన్ నిక్కీహేలీ (46) ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. హఠాత్తుగా ఆమె తీసుకున్న రాజీనామా నిర్ణయం సంచలనాన్ని సృష్టించింది. నిక్కీ రాజీనామాను అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. అమెరికాలో మరికొద్ది రోజుల్లో కీలకమైన పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిక్కీ రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శ్వేతసౌధంలోని తన కార్యాలయంలో నిక్కీతో భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ఆమె అద్భుతంగా పనిచేశారని, ఈ ఏడాది చివరలో పదవిని వీడతారని చెప్పారు. రాజీనామా విషయాన్ని నిక్కీ ఆర్నెల్ల కిందటే చెప్పారని, తానే కొద్దిగా సమయం తీసుకున్నానని ట్రంప్ విలేకర్లతో అన్నారు. ఆమె తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. రెండేళ్ల కిందట ఈ పదవిని చేపట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపారని, నిక్కీ మాత్రం పదవికే వన్నె తెచ్చేలా పనిచేశారని ప్రశంసించారు.
అయితే ఇంత హఠాత్తుగా రాజీనామా చేయడానికి గల కారణాలను మాత్రం నిక్కీ వెల్లడించలేదు. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష పదవికి ట్రంప్‌కు ప్రత్యామ్నాయంగా నిక్కీని భావిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆమె మాత్రం 2020లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడబోనని, ట్రంప్ తరఫునే ప్రచారం చేస్తానని తేల్చిచెప్పారు. ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్న నిక్కీ.. గడిచిన రెండేళ్లలో ట్రంప్ ప్రభుత్వం ఐరాసలో సాధించిన కీలక విజయాలను వివరించారు. ట్రంప్ ప్రభుత్వంలో నిక్కీ అత్యంత సీనియర్ భారతీయ అమెరికన్ అధికారి. నవంబరులో కీలకమైన పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో నిక్కీ రాజీనామా తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని నిపుణులు పేర్కొన్నారు.
జాతీయ భద్రతా సలహాదారు మెక్‌మాస్టర్‌ను ట్రంప్ గత ఏప్రిల్‌లో తొలగించారు. ఇక మార్చిలో ట్రంప్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరొందిన హోప్ హిక్స్ శక్తిమంతమైన కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. వాణిజ్య విధానంలో ట్రంప్‌తో తలెత్తిన వివాదాల వల్ల శ్వేతసౌధం కీలక ఆర్థిక సలహాదారు గ్యారీ కాన్ రాజీనామా చేశారు. విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ను తప్పించిన ట్రంప్.. ఆ స్థానంలో సీఐఏ డైరెక్టర్ పాంపియోను నియమించారు.













