అమెరికాలో తెలుగు విద్యార్థుల హఠాన్మరణం
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు హఠాన్మరణం చెందారు. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తికి చెందిన విద్యార్థి కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని తెలిసింది. వనపర్తి పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల ఏకైక కుమారుడు దినేష్(23) బీటెక్ చదివారు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం ఫెయిర్ ఫీల్డ్‌లోని సేక్రెడ్ హార్ట్ విశ్వవిద్యాలయం (ఎస్‌హెచ్‌యూ)లో ఎంఎస్ చదివేందుకు గత ఏడాది డిసెంబరు 28న పయనమయ్యారు. వెళ్లిన 17 రోజులకే తన కుమారుడు నిద్రతోనే చనిపోయినట్లు సమాచారం అందిందని బాధిత తల్లిదండ్రులు తెలిపారు. ఇతనితో పాటు శ్రీకాకుళం జిల్లా విద్యార్థి కూడా చనిపోయాడని తెలిసిందన్నారు. ఒకే గదిలో ఉన్న ఇద్దరు విద్యార్థులు నిద్రలోనే విగతజీవులుగా మారడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషవాయువు పీల్చడంతో చనిపోయి ఉండొచ్చని అక్కడి నుంచి సమాచారం వచ్చినట్లు తెలిపారు.







