అమెరికా అధ్యక్షురాలుగా హిందు మహిళ?
అమెరికా కాంగ్రెస్లో మొదటి హిందు చట్ట సభ్యురాలైన తులసి గబ్బర్, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై అమెరికా వ్యాప్తంగా ఉన్న ఇండియన్-అమెరికన్ల అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. హవాయ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 37 ఏళ్ల తులసి, అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే విషయమై అధికారిక ప్రకటన చేయనున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఆమెను అధికారికంగా ప్రకటిస్తే, అమెరికా లోని ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ నుంచి ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి హిందువుగా చరిత్రలో నిలిచిపోతుంది. తులసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, దీనిపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఇండో-అమెరికన్లు కొందరు దేశ వ్యాప్తగా ఉన్న ప్రధాన హిందు సభ్యులకు మెయిల్స్ పంపించారు. మీ నుంచి ఎలాంటి సహాయం అందుతుంది? పోటీలో నిల్చోవడం మంచిదేనా? వంటి సలహాలను హిందు సభ్యులను అడిగి తెలుసుకోనుంది. నవంబర్ 2020లో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి.













