TTA: ఘనంగా టీటీఏ దశాబ్ది ఉత్సవాలు.. డిసెంబర్ 25న హైదరాబాద్లో సాంస్కృతిక వేడుక
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) 10 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనుంది. దశాబ్ద కాలంగా తెలంగాణ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, కమ్యూనిటీ అభివృద్ధిలో టీటీఏ చేస్తున్న కృషిని చాటిచెప్పేలా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. ఇప్పటికే వీరందరికీ ఆహ్వానాలు అందజేయగా, వారు ఆహ్వానాన్ని మన్నించి హాజరవుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రముఖుల రాక ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది.
వేడుకల విశేషాలు: మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సాగే ఈ ఉత్సవాల్లో తెలంగాణ గొప్పదనాన్ని ప్రతిబింబించేలా విభిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. క్లాసికల్, జానపద నృత్యాలు, సంగీత విభావరి, సాహిత్య వేదికలు, సాంస్కృతిక సత్కారాలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ కళాకారులతో ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించనున్నాయి.
ముఖ్య సమాచారం:
వేదిక: శిల్పకళా వేదిక, హైదరాబాద్
సమయం: మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు
ప్రవేశం: ఉచితం (అందరికీ ఆహ్వానం)
విందు: హాజరైన వారందరికీ రాత్రి భోజన సౌకర్యం కలదు
తెలంగాణ అస్తిత్వాన్ని, సేవను, ఐక్యతను చాటిచెప్పే ఈ దశాబ్ది వేడుకల్లో అందరూ పాల్గొనాలని టిటిఎ నిర్వాహకులు కోరారు.






