TTA: టీటీఏ సేవా డేస్ 2025, దశాబ్ది వేడుకల ముగింపు..
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో డిసెంబర్ 8వ తేదీన ప్రారంభమైన సేవా డేస్ 2025 కార్యక్రమాలు డిసెంబర్ 25తో ముగిశాయి. సంస్థ పదేళ్ల ప్రస్థాన వేడుకలు గురువారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సేవా కార్యక్రమాల విస్తృతి…
టీటీఏ ఆధ్వర్యంలో గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, నిరుపేదలకు అవసరమైన ఆరోగ్య, విద్యా సంబంధిత సామగ్రిని, మౌలిక వసతుల పరికరాలను పంపిణీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్లగొండ, మెదక్ వంటి జిల్లాల్లో ఈ సేవలు విస్తృతంగా అందజేశారు.
దశాబ్ది వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలు
మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో టీటీఏ దశాబ్ది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పేలా కళాకారులు ప్రదర్శించిన పేరిణి, లంబాడీ, ఒగ్గు డోలు, డప్పు నృత్యం, గుస్సాడి, కొమ్ము కోయ ప్రదర్శనలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వేడుకల ప్రారంభంలో భాగంగా ప్రముఖ రచయితలు అందెశ్రీ, గద్దర్, వడ్డేపల్లి కృష్ణలకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్ వెన్నెల ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రవాస భారతీయులు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
విద్యా ప్రోత్సాహకాలు, సాహిత్య సమ్మేళనం
సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతిభావంతులైన పలువురు పేద విద్యార్థులకు టీటీఏ తరఫున ఉపకార వేతనాలు అందజేశారు. అలాగే సాహిత్య సమ్మేళనం పేరుతో నిర్వహించిన చర్చలో సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్, ప్రజాకవి గోరటి వెంకన్న, రచయిత్రి నెల్లుట్ల రమాదేవి పాల్గొని తెలుగు భాషా ప్రాముఖ్యతపై ప్రసంగించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఎక్సలెన్స్ అవార్డులను ప్రధానం చేశారు. ఈ వేడుకల్లో టీటీఏ కీలక నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో టీటీఏ ఫౌండర్ పైళ్ల మల్లారెడ్డి, మలిపెద్ది నవీన్ రెడ్డి (టీటీఏ అధ్యక్షుడు), డాక్టర్ విజయపాల్ రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్), డాక్టర్ పట్లోళ్ల మోహన్ రెడ్డి (కో ఛైర్మన్),కంది విశ్వ (కో ఆర్డినేటర్), సలహా కమిటీ సభ్యులు మాదాడి భరత్ రెడ్డి, అనుగు శ్రీని, వంశీ రెడ్డి తదితరులు ఉన్నారు.






