TTA: ‘హ్యూమన్ కాలిక్యులేటర్’ భానుతో వెబినార్ నిర్వహించిన టీటీఏ న్యూజెర్సీ చాప్టర్
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ‘మానవ కాలిక్యులేటర్’ నీలకంఠ భానుతో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో ‘మ్యాథ్ వెబినార్’ జరిగింది. టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారి ఆధ్వర్యంలో ఈ వెబినార్ నిర్వహించారు. భానుతోపాటు భాంజు కోఫౌండర్ డీ.ఎల్. ప్రచోతన్‌తో నిర్వహించిన వర్చువల్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం కూడా ఉత్తర అమెరికాలోని విద్యార్థులకు, పలు కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన అనుభవాన్ని పంచింది. ఈ కార్యక్రమంలో గ్రేడ్-1 నుంచి 8వ గ్రేడ్ వరకు ఉపయోగపడే ప్రత్యేకమైన సెషన్లను నిర్వహించారు. అలాగే గణితాన్ని వేగంగా నేర్చుకునే పలు కీలక టెక్నిక్‌లను కూడా భాను పంచుకున్నారు. ఈ వెబినార్ ద్వారా 100 మందికిపైగా విద్యార్థులకు లబ్దిచేకూరిందని టీటీఏ తెలిపింది. టీటీఏ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు నరసింహ పేరుక ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. వెబినార్ ఎక్కడా బోరింగ్‌గా మారకుండా ఆయన తన ఎనర్జీతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా మార్చారు. న్యూస్‌లెటర్ డైరెక్టర్ సుధాకర్ ఉప్పల అందించిన వోట్ ఆఫ్ థ్యాంక్స్‌తో ఈ వెబినార్ పూర్తయింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన శివా రెడ్డి కొల్ల, కవితా రెడ్డి, నరేందర్ రెడ్డి యరవ, దీపిక రెడ్డి నల్ల, అనుదీప్ దిడ్డి, జిబిన్‌తోపాటు న్యూజెర్సీ టీంకు టీటీఏ ధన్యవాదాలు తెలియజేసింది.







