TTA: టీటీఏ మెడికల్ కన్వెన్షన్.. వైద్యరంగంలో పురోగతి, సేవా కార్యక్రమాలపై చర్చ
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో, ఏఐజీ హాస్పిటల్ సహకారంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కలసి నిర్వహించిన ‘టీటీఏ మెడికల్ కన్వెన్షన్ 2025’ విజయవంతమైంది. టీటీఏ ‘సేవా డేస్’ (డిసెంబర్ 8 నుండి 25 వరకు)లో భాగంగా ఈ ముఖ్యమైన వైద్య సదస్సు జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, టీటీఏ అధ్యక్షుడు డా. నవీన్ మాలిపెద్ది, ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డా. దిలీప్ భానుశాలి, ఏఐజీ చైర్మన్ డా. నాగేశ్వర రెడ్డి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమాజ సేవలో టీటీఏ పాత్ర..
టీటీఏ వ్యవస్థాపకుడు డా. పైళ్ల మలారెడ్డి చొరవతో తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల క్రితం ఈ సంస్థ స్థాపితమైంది. టీటీఏ ఒక లాభాపేక్ష లేని సంస్థగా ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని ప్రతినిధులు తెలిపారు. గత పదేళ్లలో టీటీఏ అనేక సేవ కార్యక్రమాలు చేపట్టింది. కోవిడ్ బాధితులకు సహాయం చేసిందని టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది తెలిపారు. టీటీఏ కోఆర్డినేటర్ ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థ ఆధ్వర్యంలో అనేక వైద్య శిబిరాలను, కంటి శిబిరాలను నిర్వహించినట్లు చెప్పారు. అవసరమైన వారికి కృత్రిమ అవయవాలు, ట్రైసైకిళ్లు, వీల్చైర్లు అందించడం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని వివరించారు.
వైద్యుల సహకారం, కీలక ఒప్పందం..
IMA, TTA పరస్పర సహకారం: IMA తెలంగాణ, TTA కలిసి పనిచేయడానికి, ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలకు సేవ చేయడానికి ఒక అవగాహన ఒప్పందం (MOU) కోసం చర్చలు జరుపుతున్నాయని, దీని ద్వారా IMA వైద్యులను అందిస్తే TTA వారికి మద్దతు ఇస్తుందని IMA తెలంగాణ అధ్యక్షుడు డా. పి. కిషన్ తెలిపారు.
మాదక ద్రవ్యాలపై పోరాటం: యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరగడంపై డా. విజయ్ పాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. క్లినిక్లకు వచ్చే యువతకు “డ్రగ్స్ వద్దు” అని చెప్పాలని వైద్యులందరికీ విన్నవించారు.
ఐఎంఏ దేశవ్యాప్త కార్యక్రమాలు:
ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య సంస్థ అయిన ఐఎంఏ జాతీయ కార్యక్రమాలను జాతీయ అధ్యక్షుడు డా. దిలీప్ భానుశాలి వివరించారు.
గ్రామాల దత్తత: IMA దేశవ్యాప్తంగా 2,000 గ్రామాలను దత్తత తీసుకుంది. అక్కడ నివాసితులకు ఆరోగ్య పరీక్షలు మాత్రమే కాకుండా, పారిశుధ్యం, ఆహారపు అలవాట్లు, టీకాల వంటి జీవనశైలి నిర్వహణ కార్యక్రమాలను కూడా చేపడుతోంది.
టీకా కార్యక్రమం: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 50,000 మంది ఐఎంఏ వైద్యులకు శిక్షణ ఇస్తోంది. మొదటి దశలో 20,000 మందికి శిక్షణ ఇవ్వగా, రెండవ దశలో ఐఎంఏ వైద్యుల పిల్లలకు సగం ధరకే వ్యాక్సిన్ ఇవ్వడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదిరింది.
ప్రాథమిక జీవన మద్దతు (BLS) శిక్షణ: పాఠశాలలు, కళాశాలలు, పోలీసులు, ఆటో/బస్ డ్రైవర్లతో సహా 50,000 మంది సాధారణ ప్రజలకు బీఎల్ఎస్ శిక్షణ ఇవ్వడం జరిగింది.
గవర్నర్ ఏమన్నారంటే..
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలను అభినందించారు. ఇందులో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్, దివ్యాంగులకు మద్దతు, విద్యా సహాయం వంటి కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. ఏఐజీ ఆసుపత్రి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ తన ప్రసంగంలో ఆరోగ్య సంరక్షణపై కీలకమైన అంశాన్ని నొక్కి చెప్పారు. “మన దేశంలో మనం చేసే సాంకేతిక పురోగతి అర్థవంతంగా ఉండాలంటే, వాటికి దయ, కరుణ అనే స్పర్శ ఉండాలి” అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల శ్రమ, అంకితభావం, పారిశ్రామిక స్ఫూర్తిని కూడా ఆయన కొనియాడారు. ఈ కన్వెన్షన్ ద్వారా వైద్యరంగంలో జ్ఞానం, నైపుణ్యం పెంపొందుతాయని, ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.






