జీఎంకు ట్రంప్ వార్నింగ్
అమెరికా ఆటో రంగ దిగ్గజం జనరల్ మోటర్స్ (జీఎం)పై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వదేశంలో ఉద్యోగుల్ని తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వ్యయ నియంత్రణ అవసరమనుకుంటే చైనాలో కార్ల తయారీ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. అమెరికా, కెనడాలలో కార్ల ఉత్పత్తిని తగ్గించటం ద్వారా దాదాపు 14,800 ఉద్యోగావకాశాలను రద్దు చేస్తున్నట్లు ఈ కంపెనీ ప్రకటించిన కొద్ది రోజులకే అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రకటన చేయడం విశేషం. రెండు దేశాల్లో కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలన్న జిఎం సంస్థ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన ట్రంప్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలన్న జిఎం సంస్థ నిర్ణయం ఓహియో, మిచిగాన్ వంటీ కీలక రాష్ట్రాలలో ఉద్యోగావకాశాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతుందని పరిశీలకులు చెబుతున్నారు.













