నేను ఓడిపోతే భూకంపమే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.0 లక్ష్యంతో 2020 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రచారానికి మరింత పదును పెట్టారు. తాను మళ్లీ ఎన్నిక కాకపోతే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతాయని తనదైన శైలిలో ట్విటర్ ద్వారా హెచ్చరించారు. ఆయన ట్విటర్‌కు 61 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రంప్ 2020 ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ఆర్లాండ్, ఫ్లోరిడాలో ప్రారంభించనున్నారు. ట్రంప్ ఆర్థిక వ్యవస్థ రికార్డులు సృష్టిస్తోంది. అది ఇంకా చాలా పైకి వెళ్లాల్సి ఉంది. 2020లో ఎవరైనా నన్ను ఓడిస్తే (పోటీ తీవ్రంగా ఉంది) మార్కెట్ కుప్పకూలడం ఖాయం. అదికూడా అమెరికా గతంలో ఎన్నడూ చూడనంతగా ఉంటుంది. కీప్ అమెరికా గ్రేట్ అని ట్వీట్ చేశారు. ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత ఏడాది ఫెడ్ వడ్డీరేట్లను నాలుగుసార్లు పెంచకపోతే మార్కెట్ మరో 5 వేల నుంచి 10 వేల పాయింట్లు పెరిగి ఉండేది అని తెలిపారు. 2016లో ప్రత్యర్థులు గెలిచి ఉంటే మార్కెట్ 5 వేల నుంచి 10 వేల పాయింట్లు పడిపోయేది అని ట్వీట్ చేశారు. మీకు స్టాక్ మార్కెట్ క్రాష్ చూడాలంటే.. ట్రంప్‌ను తొలగించండి అని వ్యాఖ్యానించారు.













