జీ-7 కూటమిలోకి భారత్!
ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన జీ7లో భారత్‌కు చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు సంకేతాలిచ్చారు. జీ7 వార్షిక సదస్సును జూన్‌లో నిర్వహించాలని భావించిన ట్రంప్ దాన్ని సెప్టెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ (యూఎన్జీఏ) సమావేశాలకు వారం ముందుగానీ, తర్వాత గానీ జీ7 సదస్సు నిర్వహించనున్నట్లు ట్రంప్ తెలిపారు. అలాగే కూటమిలో మరికొన్ని దేశాలను చేర్చుకోనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. వీటిలో రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా తో పాటు భారత్ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతమున్న జీ7 కూటమి కాలం చెల్లినదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తానికి ఈ కూటమి ప్రాతినిధ్యం వహించడం లేదని, మరికొన్ని దేశాల చేరికతో జీ10 లేదా జీ 11గా మార్చాల్సిన అవసరం ఉన్నదన్నారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల తర్వాత దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.













