ఉగ్రవాదాన్ని అన్ని దేశాలు తరమికొట్టాలి
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సౌదీలో నిర్వహించిన యూఎస్-ఇస్లాం- సమ్మిట్లో ట్రంప్ ప్రసంగించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు అన్ని దేశాలు కలసికట్టుగా కలిసిరావాలన్నారు. ప్రపంచంలోని ముస్లిం దేశాధినేతలకు స్నేహితుడిగా చేస్తున్న సూచన ఒక్కటేనని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ముస్లిం ఆధిపత్య దేశాలు ముందుకు రావాలన్నారు. ఈ యుద్ధం వేర్వేరు మతాలు, వేర్వేరు విభాగాలు, లేదా వేర్వేరు సంస్కృతుల మధ్య కాదని మతం పేరుతో మానవ జీవితం, ప్రజలను మట్టుబెట్టేందుకు ప్రయత్నించే మొరటు నేరస్తుల మధ్య యుద్ధమన్నారు. ఇది మంచి, చెడుల మధ్య యుద్ధమని, మంచి దళాలు ఏకమైతే దుష్టులను తాము అధిగమించగలమని ట్రంప్ అన్నారు. ఉగ్రవాదుల హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఇది పేట్రోగిపోతోందన్నారు. మా మిత్రులు మా మద్దతుపై ఎన్నడూ సందేహించరు. అలాగే మన శత్రువులు ఎన్నడూ మా సంకల్పాన్ని సందేశించరు. మేము క్రమపద్ధతిలో సంస్కరణలు చేస్తాము, ఆకస్మికంగా కాదు అని అన్నారు. అమెరికాలో ముస్లింపై పర్యాటకులపై నిషేధం విదించిన ఆయన ముస్లిం పర్యటన చేపట్టడం, అక్కడి ముస్లింలను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నివ్వడం గమనార్హం.













