నిరసనలకు దిగొచ్చిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాలో జరుగుతున్న జాతివివక్ష ఆందోళనలు, పోలీసులు అనుసరిస్తున్న క్రూరత్వ వైఖరిపై వస్తున్న వ్యతిరేకతకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలొగ్గారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేస్తానని ఆయన వెల్లడించారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ న్యాయంగా, సురక్షితంగా జరగాలని కోరుకుంటున్నా అని అన్నారు. బ్రూక్స్ హత్యపై ట్రంప్ స్పందిస్తూ ఈ ఘటన నాకు చాలా బాధ కలిగింది అని చెప్పుకొచ్చారు. ఇది భయంకరమైన పరిస్థితి అని అన్నారు.
మినియాపోలిస్ నగరంలో పోలీసుల చేతిలో హత్యకు గురైన జార్జి ఫ్లాయిడ్ ఘటన నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు రేగిన విషయం తెలిసిందే. దీంతో పాటుగా గత వారం అట్లాంటాలో 27 ఏళ్ల మరో ఆఫ్రికన్ అమెరికన్ బ్రూక్స్‌ను పోలీసులు తుపాకీతో కాల్చి చంపారు. దీంతో దేశంలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. అత్యంత దారుణంగా ఉన్న పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్ విసృత్తంగా వినిపిస్తోంది.













