ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నారు?
నిన్న ఉద్యోగుల వీసా…నేడు స్టూడెంట్ల వీసాలపై బ్యాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి మొదటి నుంచి భిన్నంగానే కనిపిస్తోంది. పక్కా బిజినెస్‌మ్యాన్‌గా ఉంటూ, తాను పక్కా లోకల్ అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. దానికితోడు ఆయన నోటిదురుసుతనం కూడా ఆయనను వార్తల్లోకెక్కిస్తుంటుంది ట్రంప్ మహాజిత్తులమారి అని కూడా అంటారు. ఎన్నికల్లో గెలవడానికి ఆయన చేసే వ్యూహరచన ఎవరికీ అందడు. రెచ్చగొట్టి గెలవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వచ్చే నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటికే ఆయన అన్నీరకాల అస్త్రాలను వెలికితీశారు. అందులో ఒకటి వీసాలపై ఆంక్షలు. రెండవది కరోనా వైఫల్యాల నుంచి బయటపడటానికి చైనాను దోషిగా చూపించడంపైనే దృష్టి పెట్టారు. వీసాలపై ఆంక్షలతో అమెరికాలోని శ్వేతజాతీయులు ట్రంప్‌వైపు ఆకర్షితులవుతున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తోందని పత్రికలు, ఇతరులు చెప్పినా అదేమి పెద్ద జబ్బు కాదంటూ ఆదిలో ట్రంప్ చూపిన నిర్లక్ష్యం నేడు అమెరికాను నిలువులా ముంచేస్తోంది. దానికితోడు కరోనా నుంచి రక్షణకు మాస్క్ ధరించాలంటూ చెప్పినా నాకేమీ కాదు అన్నట్లుగా మాస్క్‌ను ధరించకపోవడం, కరోనా సమయంలో ప్రచార సభలు వద్దని చెప్పినా వినకుండా సభలను ఏర్పాటు చేసి ప్రసంగించడం వంటివి ఆయన ఒంటెద్దుపోకడలకు నిదర్శనం. నిన్న ఉద్యోగుల తాత్కాలిక వీసాలపై నిషేధాన్ని పొడిగించిన ట్రంప్ తాజాగా స్టూడెంట్ల వీసాలపై కూడా కన్నేశారు. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఆశనిపాతంలాంటి నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో చదువుకోవాలనుకునే ఇతర దేశాల్లో ఉన్నవారికి కూడా ట్రంప్ నిర్ణయం ఇబ్బందిని కలిగిస్తోంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో ఆన్లైన్ మాధ్యమంలోకి మారితే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు ఎఫ్1, ఎం1పై అమెరికాలో ఉంటూ పూర్తిస్థాయిలో ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నవారు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. లేదా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి. చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటే, భౌతికంగా తరగతులను నిర్వహించే విద్యాసంస్థలకు బదిలీ కావాలి. లేని పక్షంలో ఇమ్మిగ్రేషన్ విభాగం తీసుకునే చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాగే ఫాల్ సెమిస్టర్ (సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు) కోసం పూర్తి స్థాయిలో ఆన్లైన్ తరగతులు నిర్వహించే విద్యాసంస్థల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నవారికి వీసాలు జారీ చేయబోం’ అని ఐసీఈ స్పష్టంచేసింది.
భయానకం.. క్రూరం..
ట్రంప్ సర్కారు నిర్ణయంపై అమెరికాలోని విద్యావేత్తలు, చట్టసభ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయాల ప్రెసిడెంట్లు ప్రాతినిధ్యం వహించే ‘ది అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ (ఏసీఈ) స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయం భయానకమని విమర్శించింది. ట్రంప్ మూర్ఖపు నిర్ణయం వల్ల.. లక్షల మంది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రతిపక్ష డెమోక్రటిక్ నేతలు మండిపడుతున్నారు. ట్రంప్ సర్కార్ నిర్ణయం క్రూరమైనదని అమెరికా సెనేటర్ ఎలిజబెత్ వారెన్ విమర్శించారు. మరోవైపు, అమెరికాలో విద్యాలయాలను వెంటనే, కచ్చితంగా తెరువాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడంతోపాటు ఫాల్ అకడమిక్ సెషన్‌కి విద్యా సంస్థలను పునఃప్రారంభించనట్లయితే, వారికి ఫెడరల్ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. విద్యాసంస్థల పునః ప్రారంభానికి సంబంధించి అరోగ్య విభాగం జారీ చేసిన మార్గదర్శకాలను ఆచరణ సాధ్యం కాదని మండిపడ్డారు. దాంతో విద్యాసంస్థలు ఏమి చేయనున్నాయో తెలియాల్సి ఉంది. మరోవైపు ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలపై ఈ రెండు ప్రఖ్యాత విద్యా సంస్థలు బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశాయి.
ఆ నిబంధనలను తక్షణమే తాత్కాలికంగా నిలిపేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరాయి. ‘ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈ ఉత్తర్వులిచ్చారు. ఇది చాలా దారుణం. ఈ ఆదేశాలు చట్ట వ్యతిరేకం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ లారెన్స్ బేకో పేర్కొన్నారు. ఈ విషయంలో విదేశీ విద్యార్థులకు న్యాయం జరిగేలా తీవ్ర స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆన్లైన్ క్లాసెస్‌కు మారిన విద్యాసంస్థల్లోని విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న ఆదేశాల వల్ల విద్యాసంస్థలు త్వరగా పునఃప్రారంభమయ్యే అవకాశముందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డెప్యూటీ సెక్రటరీ కుసినెలీ అన్నారు.
చైనా, భారతీయ విద్యార్థులే అధికం
ట్రంప్ సర్కారు నిర్ణయం వల్ల వేలాది మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా చైనా, భారత్, దక్షిణకొరియా, సౌదీ అరేబియా, కెనడాకు చెందినవారే ఉన్నారు. స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ పోగ్రామ్ (ఎస్ఈవీపీ) గణాంకాల ప్రకారం.. 2017, 2018లలో చైనా నుంచి అత్యధికంగా 4,78,732 మంది, భారత్ నుంచి 2,51,290 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. 2017తో పోలిస్తే 2018లో భారతీయ విద్యార్థుల సంఖ్య 4,157 పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అమెరికా విదేశాంగ శాఖ 3,88,839 ఎఫ్1 వీసాలు, 9,518 ఎం-1 వీసాలను జారీచేసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషన్ స్కూల్ గణాంకాల ప్రకారం.. 2018-19 విద్యాసంవత్సరానికిగాను అమెరికాలో దాదాపు 10 లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరి ద్వారా 2018లో అమెరికా అర్థిక వ్యవస్థకు దాదాపు 45 బిలియన్ డాలర్ల (రూ.3.3 లక్షల కోట్లు) ఆదాయం సమకూరింది.
జార్జియాటెక్, క్లెమ్స్‌న్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, టెక్సాస్ ఏ అండ్ ఎం కాలేజీ స్టేషన్, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, సదరన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ అలబామా, లామర్ వర్సిటీ, డ్యూక్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, ఎమోరీ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా, జార్జియా స్టేట్ యూనివర్సిటీ, టెన్నెస్సీ టెక్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ డెంటన్, యూనివర్సిటీ ఆఫ్ కార్పస్ క్రిస్టి, కింగ్స్‌విల్లే వర్సిటీ తదితరాల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువమంది విద్యను అభ్యసిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లితండ్రుల ఆందోళన
అమెరికా విద్యాలయాల్లో ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ట్రంప్ నిర్నయంతో ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దానికితోడు తమ పిల్లల చదువులకోసం పలువురు వాణిజ్య, ప్రైవేటు బ్యాంకుల నుంచి తమ శక్తికి మించి రూ.25 నుంచి రూ.50 లక్షల దాకా విద్యా రుణాలు తీసుకున్నారు. వీరిలో మధ్యతరగతి వేతన జీవులే అధికంగా ఉన్నారు. ట్రంప్ ఆదేశాలతో తమ పిల్లలు సొంతగూటికి తిరిగి వస్తే వారి కోర్సులు పూర్తయినా.. అమెరికాకు తిరిగి వెళ్లడం.. అమెరికాలో ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదని అంటూ, వారి చదువుకోసం తీసుకున్న విద్యారుణాలు తీర్చడం కష్టసాధ్యమవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













