షట్‌డౌన్ లేనట్టే… రాజీపడిన ట్రంప్!
మెక్సికోతో సరిహద్దు గోడపై తాను కోరిన 500 కోట్ల డాలర్ల ఫెడరల్ నిధులను మంజూరు చేయడానికి డెమొక్రాట్లు తిరస్కరించడంతో ప్రభుత్వాన్ని షట్‌డౌన్ చేస్తామని బెదిరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీకి సిద్దపడ్డారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా హుకాబీ శాండర్స్ మీడియాతో మాట్లాడుతూ ఈ 5 కోట్ల డాలర్లను ఇతర మార్గాల ద్వారా తాము సమీకరించగలమన్నారు. మంగళవారం ముగిసే సరికి ప్రభుత్వ షట్డౌన్కు వెళ్లరాదని ప్రభుత్వం భావించిందని ఆమె తెలిపారు. మెక్సికోతో సరిహద్దును మూసివేయాలని మాత్రమే తాము కోరుకుంటున్నాము, ప్రభుత్వ షట్‌డౌన్ కాదు అని అధ్యక్షుని ప్రెస్ సెక్రటరీ చెప్పారు.
సరిహద్దు భద్రతపై ట్రంప్ ప్రభుత్వం 500 కోట్ల డాలర్లు కావాలని ప్రతిపాదించగా, డెమొక్రాట్లు ప్రాబల్యం గల ప్రతినిధుల సభ 106 కోట్ల డాలర్లు మాత్రమే మంజూరు చేస్తామని చెప్పింది. సరిహద్దు గోడ లేకుండానే సరిహద్దు భద్రతను పరిరక్షించవచ్చని అమెరికన్ కాంగ్రెస్ తెలిపింది. తాను కోరిన మొత్తం ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని శుక్రవారం నుంచి షట్‌డౌన్ చేస్తామని ట్రంప్ బెదిరించిన సంగతి తెలిసిందే. అమెరికన్ రాజకీయ పరిభాషలో ప్రభుత్వ షట్ డౌన్ అంటే అర్థం ఫెడరల్ ప్రభుత్వం ప్రతిపాదించిన పద్దును అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించడానికి తిరస్కరించినప్పుడు ఫెడరల్ ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను కొన్నిటిని నిలిపేయడం.













