లాక్డౌన్ కు డొనాల్డ్ ట్రంప్ నో!
కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశవ్యాపిత లాక్డౌన్ ప్రకటించే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తమ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు వివిధ స్థాయిల్లో ఉన్నందున అన్నింటినీ ఒకే గాటన కడుతూ లాక్డౌన్ ప్రకటించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఫ్లోరిడా గవర్నర్ రాస్ డిశాంటిస్ ప్రజలందరూ ఇళ్లు కదలవద్దంటూ లాక్డౌన్ ప్రకటించారని, తమ రాష్ట్రంలో పరిస్థితి దృష్ట్యా ఆయన ఆ ప్రకటన చేసి వుండవచ్చని, అయితే కొన్ని రాష్ట్రాలతో పరిస్థితి ఇంత తీవ్రంగా లేదని తెలుస్తోందన్నారు. జార్జియా, మిసిసిపి, నెవెడా రాష్ట్రాలు కూడా అదే రోజు లాక్డౌన్ ప్రకటించాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37 రాష్ట్రాలు, 74 కౌంటీలు, 14 నగరాలు, కొలంబియా, పోర్టారికో జిల్లాలో ఈ లాక్డౌన్ అమలవుతోందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా 2,00,000కు పైబడిన ఇన్ఫెక్షన్ కేసులతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా, మరణాల సంఖ్య 4,757 కు చేరిందని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా గణాంకాలు చెబుతున్నాయి.













