జీ 7 సదస్సు వాయిదా : ట్రంప్
జూన్‌లో నిర్వహించాలని అనుకున్న జీ 7 కూటమి దేశాల సదస్సును వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్‌పై జి-7 గ్రూప్ సరిగ్గా దృష్టి సారిస్తోందని అనుకోవడం లేదు. ఇది ఒక ఔట్‌డేటెడ్ గ్రూపు అని అన్నారు. ఇటువంటి సమయంలో సదస్సు విస్తరణలో భాగంగా భారత్, రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను కూడా సమావేశాలకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో లేదా ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల తర్వాత సదస్సు ఉండే అవకాశం ఉందని అన్నారు. లేకుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత నిర్వహించుకోవచ్చన్నారు. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమే ఈ జీ7 గ్రూపు. ఈ గ్రూపులో ప్రస్తుతం అమెరికాలో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, కెనడాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. 2020లో ఈ దేశాల సదస్సును అమెరికా నిర్వహించాల్సి ఉంది. మొదటగా వ్యక్తిగత హాజరు ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఇది కూడా ట్రంప్ తాజా నిర్ణయంతో వాయిదా పడింది.













