కొనసాగుతున్న అమెరికా షట్ డౌన్
అమెరికా ప్రభుత్వ తాత్కాలిక మూసివేత వచ్చే వారం కూడా కొనసాగనుంది. నూతన సంవత్సరానికి కూడా అమెరికా షట్డౌన్తోనే ప్రారంభించబోతోంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి చక్కబడలేదు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం 5.7 బిలియన్ డాలర్ల నిధులు కేటాయించాలన్న ట్రంప్ డిమాండ్‌ను డెమోక్రటిక్ పార్టీ సభ్యులు వ్యతిరేకించడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి షట్‌డౌన్ ప్రారంభమైంది. గోడకు నిధులు కేటాయించకపోతే ద్రవ్య వినిమయ బిల్లుపై సంతకం పెట్టేందుకు ట్రంప్ నిరాకరిస్తున్నారు. దీంతో వివిధ ఖర్చులకు నిధుల సరఫరా లేక ప్రభుత్వం పాక్షికంగా మూతపడింది. అమెరికా ప్రభుత్వం మూతపడడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గోడ నిర్మాణం కోసం 5.7 బిలియన్ డాలర్ల కేటాయింపుతో రూపొందించిన ద్రవ్య వినిమయ బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించింది. కానీ సెనేట్‌లో తిరస్కరణకు గురైంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 100 స్థానాలు ఉండే సెనేట్‌లో 60 వోట్లు రావాలి. డెమోక్రాట్ల మద్దతు లేకుండా అన్ని వోట్లు వచ్చే అవకాశం లేదు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సెనేట్‌లో డెమోక్రాట్ల మెజారిటీ పెరిగింది. దీంతో ట్రంప్‌కు ఇబ్బందికరంగా మారింది. గోడ కట్టాల్సిందేనని ట్రంప్ పట్టుబట్టుతుండగా, అంత మొత్తం గోడ కోసం కేటాయించడం వల్ల పన్నులు కడుతున్న ఎంతో మంది డబ్బు వృథా అవతుందని వాదిస్తూ, గోడ కట్టాలనే ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. గురువారం ఇరు వర్గాల నుంచి వెలువడిన ప్రకటనల ప్రకారం, వారు తమ తమ వాదనలకే కట్టుబడి ఉన్నారు. అయితే, ట్రంప్ మాత్రం అమెరికా షట్డౌన్పై డెమోక్రాట్లను నిందిస్తున్నారు. షట్‌డౌన్ గోడ కారణంగా కాదని, ట్రంప్, రిపబ్లికన్లు విజయం సాధించరాదని వారు ఇలా చేస్తున్నారని ట్వీట్ చేశారు. సరిహద్దు రక్షణకు గోడ చాలా అవసరమని, ఇజ్రాయెల్‌లో అక్కడి సరిహద్దు గోడ 99.9 శాతం ఉపయోగపడుతోందని చెప్పుకొచ్చారు. చర్చలు జరపకుండా క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లాలని డెమోక్రాట్లు ఇలా చేస్తున్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ శారా సాండర్స్ విమర్శించారు.













