భారత్, పాక్ దేశాల మధ్యవర్తిత్వానికి నేను రెడీ : ట్రంప్
కశ్మీరు విషయంలో సాయం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మధ్యవర్తిగా వ్యవహరించడం తనకూ ఇష్టమేనన్నారు. అమెరికా పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వైట్‌హౌస్‌లో ట్రంప్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇమ్రాన్‌తో మాట్లాడుతూ భారత్, పాక్ కోరితే ఇరు దేశాల మధ్య సంబంధాల విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని తెలిపారు. ఒకవేళ నేను సాయం చేయగలిగితే, మధ్యవర్తిగా ఉండడం కూడా నాకు ఇష్టమే. నేను ఏ విధంగా సాయపడగలనో చెబితే చేసేందుకు సిద్ధం అని ట్రంప్ పేర్కొన్నారు. కశ్మీరు అంశం ఇండియా, పాకిస్థాన్‌లకు సంబంధించిన అంశమని అది ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని అమెరికా ఎప్పుడూ చెప్పేది. అలాంటిది తాజాగా ట్రంప్ మధ్యవర్తిత్వం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.













