వేట మొదలైందన్న డొనాల్డ్ ట్రంప్
వలసవాసులపై కత్తిగట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2000 మంది వలసవాసులు అరెస్టు చేసి, దేశం నుంచి గెంటేశారు. ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసవాసులను ఏరివేయాలని గత వారం అధికారులను ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో అమెరికాలోని పది నగరాల్లో అధికారులు దాడులు చేసి వేలాది మందిని అరెస్టు చేశారు. అక్రమ వలసవాసులుగా ముద్ర వేసి వీరిని దేశం నుంచి బహిష్కరించారు. ఇతర దేశాల నుండి మెక్సికో మీదుగా తమ దేశంలో ప్రవేశించే వారంతా ఆశ్రయం పొందేందుకు అనర్హులేనని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించారు. వలసలకు సంబంధించిన కొత్త నిబంధన మంగళవారం నుండి అమలులోకి తీసుకొచ్చారు. అక్రమ వలసలను నిరోధించేందుకు కఠినమైన చట్టాలను రూపొందించటంలో కాంగ్రెస్ విఫలమైందని అధ్యక్ష భవనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అమెరికా అత్యంత ఉదారమైన దేశమని, అయితే ప్రస్తుతం దక్షిణ ప్రాంత సరిహద్దుల నుండి దేశంలోకి అక్రమంగా వలస వస్తున్న లక్షలాది మందితో అనేక సమస్యలు ఎదుర్కొంటోందని అమెరికా అటార్నీ జరనల్ బిల్ బార్ పేర్కొన్నారు.













