సెనేట్‌లో ట్రంప్ అభిశంసన ప్రారంభం
అమెరికా ఎగువసభ సెనేట్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ మొదలైంది. సెనేట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఆధిక్యత ఉండటంతో ఈ తీర్మానం వీగిపోతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ప్రధాన అభియోగం. వచ్చే ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా నిలువబోతున్న జో బిడెన్‌పై అవినీతి అభియోగాలు మోపి, దర్యాప్తు చేపట్టాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్పై డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెచ్చారని ప్రతిపక్ష డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ అభియోగాలపై దర్యాప్తునకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ను ట్రంప్ అడ్డుకున్నారన్నది రెండో అభియోగం. ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని గతేడాది డిసెంబర్ 18న ప్రతినిధుల సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగువ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అభిశంసన ప్రక్రియ మొత్తం ఆరు రోజుల పాటు కొనసాగనున్నది. రెండు పార్టీల ప్రతినిధులు చెరో 24 గంటలపాటు వాదనలు వినిపించేలా ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది.













