జీ 7 సంయుక్త ప్రకటన నుంచి తప్పుకున్న అమెరికా
జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశం అమెరికా, కెనడా మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తన వాణిజ్య విధానాలను కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తప్పుపట్టడంతో జీ7 సంయుక్త ప్రకటన నుంచి అమెరికా తప్పుకుంది. దీంతో అసంతృప్తిగానే సమావేశాలు ముగిశాయి. దీని ప్రభావం ఇరు దేశాల సంబంధాలపైనా పడనున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా వాణిజ్య విధానాలను ట్రూడో బహిరంగంగా వ్యతిరేకించారు. ఈయూ, కెనడా, మెక్సికోల నుంచి ఉక్కు, అల్యూమినియం, దిగుమతిపై సుంకాలు విధిస్తూ ఇటీవల ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రూడో వ్యతిరేకించారు. కెనడా ప్రజలు మర్యాదపూర్వకంగా ఉంటారని, ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం సహించబోరని ట్రూడో మీడియాకు తెలిపారు. దీంతో టూడో వైఖరిపై మండిపడిన ట్రంప్, జీ7 సదస్సు సంయుక్త ప్రకటనకు మద్దతు ఉపసంహరించుకోవాలని తన అధికారులను ఆదేశించారు.













