ఒబామాకు కాదు.. నాకు నోబెల్ రావాలి
తనకు ఇప్పటికే నోబెల్ శాంతిబహుమతి రావలిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నోబెల్ కమిటీ తనకు అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను శాంతి స్థాపన కోసం చాలా పనులు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా 2009లో ఒరాక్ ఒబామాకు నోబెల్ బహుమతి దేనికోసం ఇచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి చేపట్టిన కొద్ది రోజులకే ఆయనకు ఇచ్చారని, ఎందుకిచ్చారో కూడా ఒబామాకు తెలియదని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకున్నందుకు గాను ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం తెలిసిందే.













