శృంగార తారకు చెల్లింపులు నిజమే : ట్రంప్
శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు సంబంధించిన వ్యవహారంలో తన న్యాయవాది కోహెన్‌కు లక్షా 30 వేల డాలర్లు తిరిగి చెల్లించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. అయితే ఆమెతో లైంగిక సంబంధాన్ని ట్రంప్ తిరస్కరించారు. 2016 అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తమ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచేందుకు ఈ మొత్తాన్ని ముట్టజెప్పారు. ట్రంప్ తన న్యాయవాదికి రీయింబర్స్మెంట్ చేసిన విషయాన్ని ఆయన కొత్త న్యాయ సలహాదారు, న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గిలియాని ఓ మీడియా ఇంటర్వ్యూలో అంగీకరించిన కొన్ని గంటల్లోపే ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. నెలవారిగా తన న్యాయవాదికి ఈ మొత్తాన్ని భర్తి చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. సెలబ్రిటీలు, సంపన్నుల మధ్య ఇలాంటి ఒప్పందాలు సర్వసాధారణమని పేర్కొన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాన్ని ఆమె దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నామని, ఆమెతో తనకు ఎటువంటి లైంగిక సంబంధం లేదని ట్రంప్ సృష్టం చేశారు. ఇది ప్రైవేట్ ఒప్పందమని, దీనిని క్లిఫోర్డ్ (డేనియల్స్), ఆమె న్యాయవాది ఉల్లంఘించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి, ప్రచారానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.













