అతని మాటలు వింటే… 5 లక్షల మంది చనిపోయేవారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశ మేటి శాస్త్రవేత్త ఆంథోనీ ఫౌచీపై విరుచుకుపడ్డారు. లాస్ వెగాస్ హోటల్ నుంచి తమ ప్రచార సిబ్బందితో మాట్లాడిన ట్రంప్.. ఆ సమావేశంలో ఫౌచీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కరోనా వైరస్ విషయంలో ఒకవేళ ఫౌచీ చెప్పినట్లు వింటే, దేశంలో వైరస్ మృతుల సంఖ్య 5 లక్షలు దాటేదని ఆరోపించారు. ఫౌచీ ఓ డిజాస్టర్ అంటూ ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతానికి జాతీయ ఓపీనియన్ పోల్స్‌లో ట్రంప్ వెనుకంజలోనే ఉన్నా.. అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీని మాత్రం ట్రంప్ మళ్లీ తిట్టిపోశారు.
కరోనా వల్ల అమెరికాలో ఇప్పటి వరకు రెండు లక్షల 20 వేల మంది మరణించారు. మహమ్మారి వల్ల అమలు చేస్తున్న నిబంధనలతో అమెరికన్లు విసిగిపోయినట్లు ట్రంప్ తెలిపారు. మమ్ముల్ని వదిలేయండి అంటూ ప్రజలు వేడుకుంటున్నారన్నారు. ఫౌచీతో పాటు ఇంకొంత మంది మాటలు విని ప్రజలు నీరసించినట్లు ట్రంప్ ఆరోపించారు. ఓపీనియన్ పోల్స్‌లో వెనుకపడ్డా కీలకమైన రాష్ట్రాల్లో మాత్రం రిపబ్లికన్లు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల ఫలితాల ఆధారంగానే ట్రంప్ రెండోసారి గట్టెక్కే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.













