ఎమర్జెన్సీ యోచనలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-మెక్సికో సరిహద్దులో వివాదాస్పద గోడకు నిధులు సమకూర్చేందుకు జాతీయ అత్యవసర స్థితిని విధించేదిశగా అడుగులు వేస్తున్నారు. యూఎస్- మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం అంశం ఇప్పటికే 21 రోజులుగా షట్డౌన్కు దారితీసింది. బోర్డర్ వాల్ నిర్మాణానికి ట్రంప్ కాంగ్రెస్ను 5.7 బిలియన్ డాలర్లు కోరుతున్నారు. ఈ గోడ నిర్మాణం జరిగితే అమెరికాలో మెక్సికో సరిహద్దు నుంచి చొరబాట్లు తగ్గుతాయని అదేవిధంగా డ్రగ్స్ రవాణా కూడా తగ్గుతుందని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే ట్రంప్ విన్నపాన్ని డెమొక్రాట్లు పదేపదే తిరస్కరిస్తున్నారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు అందించేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ దక్షిణ సరిహద్దులోని టెక్సాస్ను సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్ మరోసారి గోడ నిర్మాణం అంశాన్ని ప్రస్తావిస్తూ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లపై ఆరా తీశారు.













