హెచ్1బి వీసాలో మార్పులకు సై
భారతీయులకు ఎక్కువగా ఉపయోగపడే హెచ్ 1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ట్రంప్ యంత్రాగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. 2019 జనవరి నాటికి హెచ్ 1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రతిపాదనలను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అందుకు సంబంధించి కసరత్తులు చేస్తుందని డీహెచ్ఎస్ తెలిపింది. దీని ప్రభావం యూఎస్‌లోని భారతీయ ఐటీ కంపెనీలు, చిన్న, మధ్యతరహా కంపెనీలపై ఎక్కువగా పడనుంది. ఈ చిన్న, మధ్యతరహా కంపెనీలను ఎక్కువగా భారతీయ అమెరికన్లే నిర్వహిస్తూ ఉంటారు.
హెచ్ 1బీ వీసాలపై వచ్చే వారి ప్రతిభకు సంబంధించిన నిబంధనలను పునర్వచించేలా ప్రతిపాదనలు తీసుకురానున్నారు. దీంతో పాటు ఉపాధి, ఉద్యోగి, యజమాని మధ్య ఉన్న సంబంధం నిర్వచనాన్ని సవరించనున్నట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది. అలాగే హెచ్ 1బీ వీసాదారులకు తగిన జీతాలు చెల్లించేందుకు అదనపు అవసరాలను పరిశీలించాలనే ప్రతిపాదనను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. హెచ్ 1బీ వీసాలో మార్పులు చేయడం వల్ల అత్యుత్తమ ప్రతిభ ఉన్న విదేశీయులను ఎక్కువగా ఆకర్షించవచ్చని ట్రంప్ యంత్రాగం భావిస్తోంది. హెచ్ 1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు హెచ్4 వీసాల కింద పని చేసేందుకు అర్హులుగా ఉన్నారు. వారిని తొలగించేందుకు ఇప్పటికే ట్రంప్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. దీనిపై భారతీయులు ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.













