అన్ని దేశాల్లో టీఆర్ఎస్ శాఖలు మహేశ్ బిగాల
అమెరికా, ఆస్ట్రేలియాలలో విద్యారంగానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్లను, ఐటీ కంపెనీలను స్థాపించి ఎంట్రప్రెన్యూరర్‌గా ఉన్న నిజామాబాద్ జిల్లావాసి టీఆర్ఎస్ పార్టీ ఎన్నారై సెల్‌ను పర్యవేక్షిస్తున్న మహేష్ బిగాల వివిధ దేశాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాఖలను ఏర్పరచడం ద్వారా బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు. ఎన్నారైలను తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకునేలా చేసేందుకు పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఆయా దేశాల్లో పార్టీ శాఖలు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ ఎంపి కవిత సూచనల మేరకు వివిధ దేశాల్లో టీఆర్ఎస్ పార్టీ విభాగాలను ఏర్పాటు చేసి ఎన్నారైలను తెలంగాణకు కనెక్ట్ చేయడంలో మహేష్ బిగాల విజయాన్ని సాధించారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కూడా మహేష్ బిగాల సమర్థతను గుర్తించి గత డిసెంబర్లో తొలి సారిగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయనను ఎన్నారై కన్వీనర్‌గా నియమించారు. వివిధ దేశాల నుంచి ఎన్నారైలను మహాసభలకు రప్పించడం ద్వారా మహేష్‌బిగాల తన సమర్థతను నిరూపించుకున్నారు.
విదేశాలలో టిఆర్ఎస్ పార్టీ శాఖలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు, ఎంపి కవిత సూచనలతో విదేశాల్లో టీఆర్ఎస్ పార్టీ శాఖలను మహేష్ బిగాల ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించి ఎన్నారైలను పార్టీవైపు ఆకర్షికులయ్యే విధంగా మహేష్ బిగాల కృషి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 32 దేశాల్లో టీఆర్ఎస్ పార్టీ శాఖలను ఆయన ఏర్పాటు చేశారు. ఏడూ ఖండాలలోనే కాకుండా దీవులలో కూడా టిఆర్ఎస్ పార్టీ శాఖలు విస్తరించడంతోపాటు, వాటిని పార్టీలో క్రియాశీల కంగా వ్యవహరించేలా చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను విస్త తంగా సోషల్ మీడియా ద్వారా ఆ శాఖలు ప్రచారం చేస్తున్నాయి.
మహేష్ బిగాల టిఆర్ఎస్ ఎన్నారై సలహాదారు ఎంపీ కవిత తో ఎప్పటికప్పుడు సమావేశమై విదేశాలలో పార్టీ పురోగతిపై సలహాలను తీసుకుంటున్నారు. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, బెహ్రయిన్, యూరోపు ఖండంలోని డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, పోలాండ్, జర్మనీ, ఇటలీ,ఫ్రాన్స్, ఆఫ్రికా ఖండంలోని సౌత్ ఆఫ్రికా, ఇథోపియా, మాల్వాయి, బోత్స్వానా, జాంబియా, సౌత్ అమెరికాలోని పెరు, కొలంబియా, పరాగ్వే, సింగపూర్, మలేషియా, చైనా, గల్ఫ్ దేశాలైన కతర్, ఒమాన్, కువైట్, సౌథీఅరేబియా, దీవిలైన మాల్దీవ్స్లలో పార్టీ శాఖలను ప్రారంభించేలా మహేష్ బిగాల కృషి చేశారు. ఈ శాఖలు పార్టీ తెలంగాణ అవతారం దినోత్సవ వేడుకలు, దీక్ష దివాస్లను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రతి సంవత్సరం జరిగే ప్లీనరీకి పార్టీ ఎన్నారైలు చాలామంది హాజరవుతూ పార్టీకి అండగా ఉంటున్నారని ఆయన చెప్పారు. హరితహారం, నేతన్నకు చేయూతలాంటి పథకాలకు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఫిలిఫైన్స్, సౌత్ ఆఫ్రికా దేశాల నుండి వచ్చినా వినతుల మేరకు ఆ దేశాలు పర్యటించి అక్కడ కూడా పార్టీ శాఖలను ప్రారంబిస్తామని మహేష్ బిగాల చెప్పారు.
ఇప్పటివరకు ఎన్ని దేశాల్లో టీఆర్ఎస్ శాఖలు ఏర్పడ్డాయి?
దాదాపుగా సప్తఖండాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ శాఖలను ఏర్పాటు చేశాము. ప్రపంచవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న ముఖ్యమంత్రి కోరికమేరకు అన్నీ దేశాలు తిరిగి పార్టీశాఖలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. తెలంగాణ పునర్నిర్మాణంలో అన్నీదేశాల్లో ఉన్న ఎన్నారైలు పాలుపంచుకోవడానికి వీలుగా, పార్టీకీ అండగా మొదటి నుంచి ఉంటున్న ఎన్నారైలను ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చేందుకు వీలుగా టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ద్వారా ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగానే ప్రతి దేశంలోనూ టీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ఇతరత్ర కార్యక్రమాలను ప్రచారం చేయడం జరుగుతోంది.
వివిధ దేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ఏ విధంగా చేపడుతున్నారు?
ముఖ్యమంత్రి పిలుపుతో, సొంత రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి కోసం. బంగారు తెలంగాణ ఏర్పాటుకు వీలుగా టీఆర్ఎస్కు మద్దతుగా నిల వాలని చాలామంది ఎన్నారైలు భావిస్తున్నారు. అలాంటివారిని కలిపి ఒకేచోట కూర్చొని చర్చించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన పార్టీ శాఖల ద్వారానే పార్టీ, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రచారం చేయడం జరుగు తోంది. పార్టీశాఖలకు అధ్యక్షులను కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే ఎంపిక చేయడం జరుగుతోంది.
పార్టీలో ఇతర సంఘాల వారిని కూడా కలుపుకుంటున్నారా?
అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ తెలంగాణ సంఘాలు ఎన్నో ఉంటాయి. అలాంటప్పుడు అన్నీ సంఘాలవారిని బంగారు తెలంగాణ కోసం ఉమ్మడిగా కృషి చేయడానికి రావా ల్సిందిగా కోరుతున్నాను. పార్టీని బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలిచి బంగారు తెలంగాణను సాధించేందుకు వీలవుతుందని చెబుతున్నాను. ఇందుకోసం ఇతర సంఘాల వారిని కూడా పార్టీశాఖల్లో చేరాల్సిందిగా ఆహ్వానిస్తాను.













