కరోనా సమయంలో అమెరికా ప్రయాణం – 1
ప్రపంచం అంతా కరోనా వైరస్‌తో అల్లాడుతున్న సమయంలో, దానికితోడు ఇండియాలో విధించిన లాక్డౌన్ సమయంలో నెల్లూరు నుంచి అమెరికాకు ఎంతో ధైర్యంగా పయనమైన ఛార్లెట్ వాసి జ్యోతిర్మయి కొత్త తన బ్లాగ్‌లో రాసిన అమెరికా ప్రయాణ అనుభవాలను అందరూ చదవాలన్న ఉద్దేశ్యంతో తెలుగుటైమ్స్ పాఠకులకు యథాతథంగా అందిస్తున్నాము.
-ఎడిటర్
ఏ దేశమైన చూడాలంటే అక్కడి జీవనసరళి తెలుసుకోవాలంటే కనీసం ఓ రెండు నెలలైనా అక్కడే ఉండాలని నా అభిప్రాయం. ఆ కోరిక నాకు ఇండియాలో తీరింది. అదేమిటి నువ్వు ఇండియన్ వేగా వేరుగా దేశం చూడడమేమిటి అనుకోకండి. నేను ఇండియన్ ని అయినా అమెరికాకు వచ్చి దాదాపుగా పాతికేళ్ళవుతోంది. ప్రతి రెండేళ్ళకూ, ఇంకా తక్కువ వ్యవధిలోనూ ఇండియా వెళ్తున్నా నేను అక్కడ అతిథినే. చుట్టాలను, స్నేహితులనూ కలవడం అన్నీ అమర్చిపెడుతుంటే అలా వెళ్ళి షాపింగ్ చేసుకుని రావడం ఇలా అన్నమాట. అది ఇండియాలో ఉండడం ఎలా అవుతుంది?
ఈసారి ఆ కోరిక తీర్చుకోవడానికి మెడిసిన్ పూర్తి చేయబోతన్న మా అమ్మాయి దగ్గర ఉండడానికి అక్టోబర్‌లో ఇండియా వెళ్ళాను. ఏప్రిల్ పదహారున తిరుగు ప్రయాణం, ఇదీ ప్రణాళిక. నెల్లూరులో ఇల్లు, వాకిలీ అద్దెకు తీసుకుని పాలు, నీళ్ళు, పేపర్ అన్నీ సమకూర్చుకుని, అక్కడి వాతావరణానికి, జీవనానికి అలవాటు పడుతూ, ఆస్వాదిస్తూ వున్నాను. ఏదీ ఫిబ్రవరి ఆఖరి వారం దాకా.
అప్పటికే కరోనా గురించి అక్కడెక్కడో చైనాలో అలా ఉందీ, ఇటలీలో ఇలా ఉందీ అని వార్తలు వినపడుతున్నాయి. హఠాత్తుగా ఒకరోజు హైదరాబాద్ లో కరోనా అని చదివి “మన పక్కకు కూడా వచ్చిందీ ఇది” అనుకున్నాను. ఆ వైరస్ సోకినతని కుటుంబసభ్యులకు కూడా వచ్చిందనీ, వాళ్ళందరూ క్వారంటైన్ లో ఉన్నారనీ తెలిశాక కొద్దిగా కంగారు మొదలైంది.
మేము టికెట్ ప్రీ పోన్ చేసికుని మార్చ్ నెలాఖరకు అమెరికాకు వచ్చేస్తే మంచిదేమో అన్నాను శ్రీవారితో. దానికి మా అమ్మాయి ఈ వైరస్, దాని సీరియస్ నెస్ గురించి వివరించింది. చైనాలో మొదలైనప్పటికి అవేర్ నెస్ లేక ఎక్కువగా వ్యాపించిందనీ, అందువలన వైరస్ లోడ్ ఎక్కువై ప్రాణాంతకంగా పరిణమించిందనీ, ఇది గాలి ద్వారా వ్యాపించదనీ, ప్రస్తుతం మరే ఇతర దేశాలలో అంత ప్రమాదమేమి లేదని, పైగా ఆరోగ్యవంతులకు వచ్చినా అది మామూలు ఫ్లూ లాంటిదే తగ్గిపోతుంది కానీ ప్రాణభయమేమి లేదని చెప్పింది. ఆ వైరస్ లోడ్ ఏమిటని అడిగాను. వైరస్ లోడ్ అంటే మన అపార్ట్ మెంటే తీసుకో దాదాపుగా వందమంది ఉన్న ఈ అపార్ట్మెంట్ లో నలుగురికి వస్తే పెద్ద ప్రమాదం ఏమీ లేదు, అదే ఎనభై మందికి వచ్చిందనుకో వైరస్ అన్నిచోట్లా వ్యాపించి అది శరీరంలోకి ఎక్కువ కణాలుగా ప్రవేశిస్తుంది. దాంతో వ్యాధి నిరోధక శక్తి సరిపోక అనారోగ్యం ఎక్కువవుతుంది. అప్పుడు వయసు, ఆరోగ్యస్థితితో సంబంధం లేకుండా ప్రాణహాని ఉంటుంది. దానికి పరిష్కారం జాగ్రత్తలు పాటించడమే. ప్రతి గంటకూ, బయటకు వెళ్ళివచ్చిన ప్రతిసారీ ఇరవై సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలని వివరించింది.
మరో వారానికి అంటే మార్చ్ పదకొండున ఆంధ్రప్రదేశ్ లో మొదటి కరోనా కేస్ రిజిస్టర్ అయింది, అదీ నెల్లూరులోనే. ఆ వ్యక్తి ఇటలీ నుండి వచ్చి ఓ వారం చిన్న బజారంతా తిరిగేశాడని తెలిశాక మొదలైంది అసలు కంగారు, నాకే కాదు నెల్లూరు వాసులందరికీనూ. ఎందుకంటే చిన్న బజార్ నెల్లూరు మధ్యలో ఉండే వ్యాపార కేంద్రం, ఎక్కువ జనసంచారం ఉండే ప్రాంతం. అయితే అతని కుటుంబసభ్యులెవరికీ వ్యాపించలేదనే సరికి కొద్దిగా ఉపశమనం కలిగింది.
అప్పటికే అమెరికాలో స్కూళ్ళు, యూనివర్సిటీలకు స్ప్రింగ్ బ్రేక్ ముందుగా ఇచ్చేశారు. మార్చ్ పదకొండున పాఠశాల సభ్యులం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని తరగతులను రద్దు చేసి తల్లిదండ్రులే పిల్లలకు పాఠాలు చెప్పేట్లుగానూ, ఈ ఏడాది వార్షికోత్సవం రద్దు చేసేట్లుగానూ నిర్ణయం తీసుకున్నాం. ఓ వారం పోయాక అమెరికన్ గవర్నమెంట్ విద్యార్ధులు ఎవరూ స్కూళ్ళ కు, యూనివర్సిటీలకూ రానక్కర్లేదనీ ఆన్ లైన్ పాఠాలు మొదలు పెట్టే ఏర్పాట్లు చేస్తున్నామనీ చెప్పారు. యూనివర్సిటీ నుండి స్ప్రింగ్ బ్రేక్ కి ఇంటికి వచ్చిన పండు మరి తిరిగి వెళ్ళలేదు.
మార్చ్ రెండవ వారానికి వచ్చేసరికి మరో కేసు నెల్లూరులో, అతను కూడా ఇటలీ నుండే వచ్చాడు. ఈ మధ్య ఏపీలో చాలా మంది చదువుకోవడానికి ఇటలీ వెళ్తున్నారట. అలా వెళ్ళిన వారందరూ అక్కడ పరిస్థితి బాగాలేక తిరిగి మాతృదేశానికి వచ్చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఈ వైరస్ పట్ల స్పృహ కలిగించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఫోన్ లో ఖళ్ ఖళ్ మని దగ్గు, ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఓ అరనిముషం పాటు వినిపించడం, పేపర్లో, టీవీలో ప్రకటనలివ్వడం లాంటివి. ప్రజలకు కూడా దీని సీరియస్ నెస్ బాగానే అర్ధం అయింది.
రోడ్డు మీద కూడా అక్కడక్కడా మాస్కులు వేసుకుని కనిపిస్తున్నారు. ముఖ్యంగా కూరలమ్మే వాళ్ళూ, ఆటో వాళ్ళూ జాగ్రత్తలు చక్కగా పాటిస్తున్నారు. ఇండియాలో గొప్ప అవేర్ నెస్ వచ్చింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారు తుమ్మినా దగ్గినా వెంటనే మెడికల్ ఆఫీసర్లకూ, హాస్పిటల్ కూ ఫోన్స్ చెయ్యడం మొదలుపెట్టారు. ఓ నాలుగు వారాలలో పరిస్థితి అదుపులోకి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళం, పైగా ప్రాణ భయం ఏమీ లేదుగా అనే ధీమా. అప్పటికి బయట దేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే ఈ వైరస్ సోకింది. దక్షిణ భారత దేశంలో పెద్దగా ఈ వ్యాధి వ్యాపించలేదు. బహుశ ఇక్కడి వేడి వాతావరణం కారణం కావచ్చు. లేదా ఇక్కడ ప్రజల ఇమ్యూనిటీ కావచ్చు. ఒకవేళ ఎక్కువమంది పేషంట్స్ వచ్చినా వైద్య సదుపాయం అందించడానికి వీలుగా గవర్నెమెంట్ మరియు ప్రయివేట్ హాస్పిటల్స్ అదనపు వార్డులు ఏర్పాట్లు చేస్తున్నాయని కూడా తెలిసింది.
మార్చ్ పదిహేడువ తేదీ నుండి షిర్డీలోనూ, ఇరవైయ్యొవ తేదీ నుండి తిరుపతిలోనూ దర్శనాలు ఆపేశారు. మార్చ్ ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు ఇండియా నుండి ఇతరదేశాలకు విమానప్రయాణాల రాకపోకలు రద్దు అనే వార్త భారతదేశం ప్రకటించింది. ఆ వార్తలు విన్నాక నాకు మళ్ళీ కలవరం మొదలయ్యింది. ఒకవేళ అమెరికా వెళ్ళేవరకు పరిస్థితి ఇలాగే ఉంటే ఎలాగా అని. అప్పటికే అమెరికాలో కూడా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది.
అప్పుడు మా అమ్మాయి, “అమ్మా, నాన్న గురించి నువ్వు టెన్షన్ పడుతూ ఇక్కడ ఉండడం కంటే నువ్వెళ్ళు నేను తరువాత వస్తాను” అన్నది. వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. పాప నొక్కదాన్నే వదిలి ఎలా వస్తావు? ఇప్పటికిప్పుడు బయలుదేరవలసిన అవసరం లేదు నేనూ పండూ జాగ్రత్తగానే ఉన్నాం. ఒకటిరెండు వారాలు ఇలాగే ఉంటుంది తరువాత అంతా సర్దుకుంటుంది. ఏప్రిల్ పదహారు నాటికి అంతా మామూలయిపోతుంది. మీ ప్రయాణానికేమీ ఇబ్బంది ఉండదు అనవసర ఆలోచనలు చేయక హాయిగా నిద్రపో అని సెలవిచ్చారు. ఈ చర్చలన్నీ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో జరిగాయి.
రాత్రి రెండు గంటలకు శ్రీవారి నుండి ఫోన్, ఒక లింక్ పంపించాను చదువు అంటూ. లింక్ ఓపెన్ చేస్తే, అమెరికా ట్రావల్ 4 అడ్వైజరీ అంటూ ఓ వార్త కనిపించింది. దాని సారాంశం ఏమిటంటే అమెరికా పౌరులు ఏ దేశాలలో ఉన్నా తిరిగి అమెరికా రావలసిందనిన్నూ రాని పక్షంలో ఆయా దేశాలల్లో అనిర్నీత కాలం ఉండేట్లుగా తగిన ఏర్పాట్లు చేసుకోవలసింది అనిన్నూ. ఆ వార్త పూర్తిగా చదివే లోపలే “టికెట్ దొరికింది రేపు రాత్రికే మీ ప్రయాణం, ఐటనరీ ఇప్పుడే మెయిల్ పంపించాను” అన్నారు. మరీ మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నామేమో అన్నాను. “లేదు, ఇప్పటికే అన్ని ఎయిర్ లైన్స్ కాన్సిల్ అయ్యాయి. లక్కీగా ఎమిరేట్స్ ఒక్కటే ఉంది. ట్రావెల్ ఫోర్ అడ్వైజ్ ఇచ్చారంటే అమెరికా త్వరలో లాక్ డౌన్ చేస్తుందేమో! అప్పుడు ఒక దేశానికి మరో దేశానికి రాకపోకలు ఎక్కువకాలం నిలిచిపోతాయి. ఏప్రిల్ కి కూడా పరిస్థితిలో మార్పు లేకపోవచ్చు. నీవూహించిందే నిజమయ్యేలా ఉంది” అన్నారు.
శుక్రవారం అర్థరాత్రి మూడు గంటలకు టికెట్ బుక్ చేశారు. ఫ్లయిట్ శనివారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిముషాలకు. అంటే కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే ఉంది మానసికంగా సంసిద్దమవడానికి, కావలసిన వస్తువులు సర్దుకోవడానికి. టైలర్ల దగ్గర, లాండ్రీలో బట్టలు ఉన్నాయి. పాపకు హౌసీ పూర్తవడానికి ఇంకా వారం ఉంది. పైగా డిసెంబర్ లో తనకు డెంగ్యూ రావడంతో ఓ వారం ఎక్స్టెన్షన్ ఉంది. ఇంకా అత్యవరసరమైన ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ అవి ఎప్పుడు పెడతారో తెలియదు. కానీ ఇప్పుడు కనుక ఇండియాలోనే ఉండిపోతే మళ్ళీ ఆమెరికాకు ఎప్పటికి వెళ్ళగలమో తెలియని పరిస్థితి. పాల వాళ్ళకు, పని మనిషికి, పేపర్ అతనికీ చెప్పాలి. ఇంటి ఓనర్, మ్యూజిక్ టీచర్, యోగా టీచర్లకు ఈ విషయం చెప్పి వీడ్కోలు తీసుకోవాలి. తెల్లవారేదాకా రకరకాల ఆలోచనలు.













