కరోనా కష్టాలు…ట్యాక్స్ వ్యవధి పెంచాలన్న బిజినెస్ వర్గాలు
కోవిడ్ 19 వైరస్‌తో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అటు వ్యాపారాలు సరిగా జరగక కష్టాలపాలవుతున్న బిజినెస్ వర్గాలు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్, ఇతర విషయాల్లో వ్యవధిని పెంచాలని కోరుతున్నాయి. తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు పలువురు బిజినెస్ వర్గాలతోనూ, ఇతరులతోనూ మాట్లాడినప్పుడు వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారులకోసం వెంటనే ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు. దాంతోపాటు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్లను వాయిదా వేయడమో లేక రద్దు చేయడమో చేయాలని కూడా వారు కోరారు.
అమెరికాలో ఇప్పటికే బిజినెస్ వర్గాలకు అనుకూలంగా ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమెరికాలో ఇన్‌కమ్‌ట్యాక్స్ ఫైలింగ్ గడువు ఏప్రిల్ 15వ తేదీనాటికి ఉంటే, దానిని జూలై 15వరకు పెంచారు. అధ్యక్షుడు ట్రంప్ సూచనతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారయంత్రాంగం పేర్కొంది. ఇందువల్ల ఆ గడువులోపల ట్యాక్స్ లు ఎటువంటి పెనాల్టీ లేకుండా కట్టవచ్చు.
ఇదే విధంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు బిజినెస్ వర్గాలకు ట్యాక్స్ లు విషయంలో గడువును పెంచాలని చాలామంది బిజినెస్ ప్రముఖులు, మధ్యతరగతి వ్యాపారవర్గాలవారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ వైరస్ కారణంగా తీసుకుంటున్న చర్యలపై వారు సంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ వ్యాపారాలు సరిగా జరగని నేపథ్యంలో తమను ఆదుకునేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని వారు కోరుతున్నారు.
మార్చి 2020తో ముగియనున్న ఆర్థిక సంవత్సరం నేపథ్యంలో సమర్పించాల్సిన జిఎస్టీ ఇతర ట్యాక్స్ గడువును పెంచడమో లేక పరస్థితులు మెరుగుపడేవరకు వాయిదా వేయడమో చేయాలని వారు కోరుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో విధించిన పెనాల్టిని, ఇతర ఛార్జీలను కూడా రద్దు చేయాలని వారు కోరారు. కోవిడ్ 19 వైరస్‌తో తాము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు.
త్వరలో ఆర్థిక ప్యాకేజీ-నిర్మలా సీతారామన్
కరోనా వైరస్ ప్రభావం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న రంగాలకు ఆర్థిక ప్యాకేజీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం భరోసానిచ్చారు. అయితే, ఇందుకు ఎన్ని రోజులు పడుతుందన్న వివరాలను ఆమె వెల్లడించలేదు. ఆయా శాఖల నుంచి వచ్చిన డిమాండ్లపై విస్తృతంగా చర్చించినట్టు మంత్రి తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు అంతర్గతంగా మరో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రధాని ప్రకటించిన కోవిడ్-19 ఎకనమిక్ రెస్పాన్స్ టీమ్ ఇంకా ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఆర్థిక రంగానికి సంబంధించి ఉపశమన చర్యల గురించి మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు.. సెబీ ప్రకటించిన నియంత్రణ చర్యలు మార్కెట్లలో కొంత స్థిరత్వాన్ని తీసుకొస్తాయన్నారు. ప్రస్తుత స్థితిలో ప్రతీ ఒక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకుని వాటిపై పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు చెప్పారు.













