టీపాడ్ కొత్తగూడెంలోని కొన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణి
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ అఫ్ డాలస్ (టీపాడ్) ప్రతీ సంవత్సరం డల్లాస్ నగరం టెక్సాస్ రాష్ట్రం అమెరికాలో బతుకమ్మ, దసరా వేడుకలను ప్రపంచంలోనె అతి పెద్దఎత్తున జరుపుతుంది. ప్రతీ వేసవిలో డాలస్ నగరవాసులందరికి వనభోజనాలు జరుపుతుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, పండగలను పాశ్చాత్య దేశాలలో ప్రతిభింబించేలా చేయడమే కాకుండా మన లలిత కళలకు జీవం పోస్తూ ఎంతో మంది కళాకారులకు గొప్ప వేదికను కలుగజేస్తుంది. ప్రతీ ఏటా రక్త దాన శిభిరాలతో పాటు, యిల్లు, నీడ లేని వారికి అన్న దానాలు చేస్తూ పెద్ద ఆసరాగా నిలబడుతుంది. స్థానిక మరియు జాతీయ సంస్థలు చేసే కార్యక్రమాలకి చేదోడై, తోడు నీడలా బాధ్యతలను తన భుజాలపై వేసుకుంటుంది. కరోనా లాంటి ఉపద్రవాలు వొచ్చినప్పుడు కూడా అమెరికాలోని ఆరోగ్య కేంద్రాలకు మాస్కులు, వైద్య పరంగా కావలసినవి సమకూర్చడమే కాకుండా, ఇండియా నుండి వొచ్చిన విద్యార్థులకు కూడా కావాల్సిన నిరంతంర సహాయం చేస్తూనే వుంది.
టీపాడ్ సంస్థ చేసే కమ్యూనిటీ సర్వీసెస్ లో భాగంగా మాతృభూమి ఇండియాలో కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతున్న కారణంగా, చాలా మంది నిరుపేదలు వారి ఉపాధి కోల్పోయి, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో “కొత్తగూడెం” లోవారు జీవించడానికి కనీస అవసరాలైన నిత్యావసరాలు కూడా సమకూర్చు కోలేని స్థితిలో ఉన్నారని తెలిసి “టీపాడ్” సంస్థ కార్యదర్శి అనురాధ మేకల, కొత్తగూడెం గ్రామస్థులయిన సతీష్ , జ్యోతి,కాల్వ సుధాకర్ ,అక్రమ్, షాబుద్దీన్ , శ్రీనివాస్ , నాగారాజు , స్వరూప , సుజాత ,మల్లేశ్వరి మున్నగు వారితో సంప్రదించి “కొత్తగూడెం సెయింట్ జోసెఫ్ హై స్కూల్” లో 25 కుటుంబాలకి ఒక మాసానికి సరిపడే నిత్యావసర వస్తువులు విరాళంగా అందచేశారు. టీప్యాడ్ సంస్థ నాయకత్వమైన ఫౌండింగ్ కమిటీ చైర్ రావు కల్వల గారికి, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్ మాధవి సుంకిరెడ్డి గారికి, కో ఆర్డినేటర్ బుచ్చి రెడ్డి గోలి గారికి , అధ్యక్షులు రవికాంత్ రెడ్డి మామిడి గారికి మరియు కార్యవర్గ బృందానికి కొత్తగూడెం సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్ మరియు గ్రామస్థులు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసారు.
టీపాడ్ నాయకత్వము, సంస్థ కార్యవర్గ బృందంతో కలిసి కోవిడ్ ఆపద సమయములో ముందుగా తెలంగాణ రాష్ట్రములో నారాయణపేట జిల్లా నర్వ మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు వివిధ విభాగాల్లో నిరంతరం సేవలందిస్తున్న వారికి దాదాపు వెయ్యిడాలర్ల విలువైన N-95 మాస్కులు మరియు శానిటైజెర్ల పంపిణీ చేసారు. తరువాత ఆంధ్ర రాష్ట్రములో కృష్ణ జిల్లా కూచిపూడి గ్రామములో 20 కుటుంబాలకు ఒక మాసానికి సరిపడే నిత్యావసర వస్తువులనుఅందచేశారు. అదేవిధంగా కొత్త గూడెంలో కూడా 25 కుటుంబాలకి ఈ సహాయ కార్యక్రమం చేపడుతున్నందుకు, ఆపదలో ఉన్న వారికి చేయూతను యిస్తున్నందుకు తమకెంతో సంతృపిని కలుగచేసిందని తెలియచేసారు. మునుముందు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయడానికి సంస్థ యెల్ల వేళల సంసిద్ధంగా ఉందని తెలియచేసారు.













