నాలుగో వంతు మరణాలు అక్కడే
కొవిడ్ 19 మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే భూమ్మీద ఏ దేశంలోనూ నమోదుకానన్ని కరోనా మరణాలు, కేసులతో అగ్రరాజ్యం ముందుంది. తాజా గణంకాలు పరిశీలిస్తే అక్కడి పరిస్థితులపై మరింత ఆందోళన కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇక్కడే మూడో వంతు నమోదయ్యాయి. అమెరికాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 9.2 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 51 వేలకు పెరిగింది. ఆ తర్వాత స్పెయిన్ (219,764), ఇటలీ (1,92,994), ఫ్రాన్స్ (1,59,495), జర్మనీ (1,54,545), యుకే (1,44,635), టర్కీ (1,04,912) అత్యధిక కేసులతో ఉన్నాయి. మరోవైపు అన్ని దేశాలతో పోలిస్తే అమెరికాలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, మరణాల శాతం మాత్రం తక్కువగానే ఉంది. ఇప్పటివరకు అమెరికాలో 51 వేల మంది మృతి చెందగా, ఇటలీ(25,969), స్పెయిన్ (22,524), ఫ్రాన్స్ (22,245), యూకే (19,506) వరుసగా ఉన్నాయి. ఒక్క న్యూయార్క్‌లోనే 2,71,890 మంది బారిన పడడంతో ఇక్కడే అత్యధికంగా 17,671 మంది మృతి చెందారు.













