అరుదైన ఘనత సాధించిన స్వర వీణాపాణి
సంగీత దర్శకుడు స్వరవీణాపాణిగా సుపరిచితులైన వోగేటి నాగ వెంకట రమణమూర్తి అరుదైన ఘనత సాధించారు. లండన్ వేదికగా నిర్వహించిన సంగీత విభావరిలో లాంగెస్ట్ మారథాన్ చర్చ్ ఆర్గాన్ ప్లేయింగ్ అంశంలో 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61 గంటల 20 నిమిషాల పాటు సంగీత సాధన చేసి.. పాటలు అలపించి గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) వెన్నం ఫౌండేషన్ (అమెరికా), స్వర నిధి (ఇండియా), ద భవన్ (యూకే) సంయుక్తంగా లండన్లో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 2 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో నార్వేకు చెందిన నీనా ఇర్స్ లింగర్ పేరిట ఉన్న 60 గంటల ఒక నిమిషం 25 సెకన్ల రికార్డును స్వరవీణాపాణి అధిగమించి సంగీత మారథాన్లో సరికొత్త రికార్డు సృష్టించారు. గిన్నిస్ రికార్డుల అధికారిక న్యాయ నిర్ణేత జాక్ బ్రాక్ బ్యాంక్ రికార్డుకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రిపుల్ గిన్సిన్ రికార్డు విజేత డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి, గిన్నిస్ అధికారులు జాక్, సోనియా, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక చైర్మన్ సత్య ప్రసాద్ కిల్లీ, అధ్యక్ష, ఉపాధ్యక్షులు రాజ శేఖర్ కుర్బ, సి.అమర్నాథ్రెడ్డి స్వరవీణాపాణిని సత్కరించారు.













