NATS: నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు ప్రముఖ దర్శకులు
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ (NATS) అమెరికా తెలుగు సంబరాల కోసం తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ దర్శకులు తరలివస్తున్నారు. ప్లోరిడాలో టంపా (Tampa) వేదికగా జూలై 4,5,6 తేదీల్లో జరిగే అమెరికా తెలుగు సంబరాల కోసం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుతో పాటు పుష్పతో బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన సుకుమార్, వీరసింహారెడ్డితో అందరి చేత జై బాలయ్య అనిపించిన గోపిచంద్ మలినేని, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్, ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్‌లు విచ్చేయనున్నారు. వీరిలో కొందరు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ప్రత్యేక కార్యక్రమాల కోసం తెర వెనుక కూడా తమ వంత సాయం చేస్తున్నారు. టంపాలో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో అమెరికాలో ఉండే తెలుగువారంతా రావాలని నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ ఆహ్వానించారు. తెలుగు సినీ దర్శక దిగ్గజాలతో పాటు ఎందరో సినీ కళాకారులు, తెలుగు ప్రముఖులు సంబరాల్లో పాల్గొంటారని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు.
ఈ 8 వ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ కుటుంబసమేతంగా రావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి పిలుపునిచ్చారు. అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు 300 మంది సంబరాల కార్యవర్గ కమిటీ సభ్యులు ఇప్పటినుంచే ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సంబరాల్లో తెలుగు వారిని అలరించే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు.







