ఉల్లాసంగా టిఎల్‌సిఎ పిక్నిక్
న్యూయార్క్‌లో ఉన్న తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 27, 2023న నిర్వహించిన పిక్నిక్ కార్యక్రమం విజయవంతమైంది. అధ్యక్షుడు నెహ్రూ కఠారు, ఆయన ఆధ్వర్యంలోని కమిటీ సభ్యుల సహకారంతో నిర్వహించిన ఈ పిక్నిక్ కార్యక్రమంలో టిఎల్‌సిఎ సభ్యులతోపాటు, ఇతర తెలుగు ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. బెల్మాంట్ లేక్ స్టేట్ పార్క్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభ్యులకోసం పలు కార్యక్రమాలను, ఆటలను ఏర్పాటు చేశారు. ట్రెజర్ హంట్ కార్యక్రమం, బింగో, ఇతర ఆటలతో వచ్చినవారు ఉల్లాసంగా గడిపారు. అలాగే చిన్నారులకు, పెద్దలకు కూడా కొన్ని పోటీలను నిర్వహించారు. రోనాల్డ్ మెక్‌డొనాల్డ్ హౌస్ కోసం నిధులను కూడా సేకరించారు. చైల్డ్‌హుడ్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జరిపే పోరాటానికి టిఎల్‌సిఎ కూడా తనవంతుగా మద్దతును ఈ నిధుల సేకరణ ద్వారా అందించింది. ఈ వేడుకలకు వచ్చినవారంతా లైఫ్ స్టయిల్ ఒత్తిడి నుంచి కొంత రిలాక్స్ అయ్యామని చెప్పారు. వచ్చినవారికి పసందైన వంటకాలను కూడా వడ్డించారు.
ఈ కార్యక్రమంలో నెహ్రూ కఠారుతోపాటు బోర్డ్ చైర్మన్ డా. ప్రసాద్ అంకినీడు, బోర్డ్ సెక్రటరీ నాగేందర్ గుప్తా, ఈవెంట్ కో ఆర్డినేటర్లు మాధవి కోరుకొండ, అరుంధతి అడుప, కరుణ అంజపురి, మాజీ అధ్యక్షులు, బోర్డ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, టిటిఎ ఫౌండర్, తెలుగు ప్రముఖులు డా. పైళ్ళ మల్లారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.













