NATS: నాట్స్ సంబరాల్లో ఆకట్టుకున్న తిరుమల సెట్టింగ్స్
ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాబేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(NATS) 8వ అమెరికా తెలుగు సంబరాలు జూలై 4వ తేదీ శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేడుకలకు వచ్చిన పలువురిని అక్కడ ఉన్న సెట్టింగ్స్ ఎంతో ఆకర్షిస్తోంది. ముఖ్యంగా తిరుమలను తలపించేలా చేసిన సెట్టింగ్స్ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద సంఖ్యలో భారీ విరాళం ఇస్తున్నవారిలో ఒకరైన శ్రీనివాస్ గుత్తికొండ ఈ కాన్ఫరెన్స్‌కు కన్వీనర్ గా ఉండటంతో ఆయన తిరుమల శ్రీవారిపై ఉన్న తన భక్తిని మరోసారి ఈ ఏర్పాట్ల ద్వారా చాటుకున్నారు. దీంతో అమెరికా తెలుగు సంబరాల్లో సభాస్థలి వద్ద ఏ దిక్కు చూసినా వెంకన్న కానీ వినాయకుడు గానీ కనిపించేలా దేవాలయ సెట్టింగు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం కార్యక్రమం పూర్తిగా శ్రీనివాసునికే అంకితం చేసి నాట్స్ సంస్థతో పాటు సంబరాల సమన్వయకర్త గుత్తికొండ స్వామివారి పట్ల తమ భక్తిప్రపత్తులు మరోమారు చాటుకున్నారు. ఈ వేడుకలకు వచ్చినవారంతో ఇక్కడి ఆధ్యాత్మిక ఏర్పాట్లు చూసి భక్తిభావంతో పులకించిపోయారు.







