డబ్ల్యూహెచ్ఓకు బెదిరింపులు సరికాదు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు అమెరికా చేస్తున్న బెదిరింపులను యూరోపియన్ యూనియన్ (ఈయు) తిరస్కరించింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థకు మద్దతు ఇవ్వాల్సిన సమయమని, వేలెత్తి చూపడానికి లేదా సహకారం తగ్గించడానికి సమయం కాదని ఈయు ప్రతినిధి విర్గినై బట్టు తెలిపారు. డబ్ల్యూహెచ్ఓకు నిధులు శాశ్వతంగా నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హూంకరిస్తున్న నేపథ్యంలో ఈయు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరోనా వైరస్‌పై విజయానికి ప్రాంతీయ దిగ్బంధం, బహుపాక్షిక చర్యలు ముఖ్యమని ఈయు ప్రతినిధి తెలిపారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వర్చువల్ సమావేశం (ఆన్లైన్ మీటింగ్)లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటరస్ మాట్లాడుతూ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చే సూచనలు, సలహాలను కొన్ని దేశాలు పెడచెవిన పెట్టడం వల్ల ప్రపంచం నేడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.













