నిషేధంపై కోర్టుకు టిక్‌టాక్..
అమెరికాలో తమ కార్యకలాపాల మీద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిషేధం విధించడంపై సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ కోర్టును ఆశ్రయించింది. సెప్టెంబరు 15 లోగా దేశంలో కార్యకలాపాలను మూసివేయాలన్న ట్రంప్ ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వును సవాలు చేస్తూ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో టిక్‌టాక్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనను వినేందుకు అమెరికా అధికారిక యంత్రాంగం సిద్ధంగా లేకపోవడంతో కోర్టును ఆశ్రయించడం అనివార్యమైనదని సంస్థ తెలిపింది. ట్రంప్ ప్రభుత్వం దేశ భద్రతకు సంబంధించి సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోలేదని టిక్‌టాక్ తన ఫిర్యాదులో ఆరోపించింది. అలాగే ఈ ఉత్తర్వు రాజకీయ ఉద్దేశాలతో కూడుకున్నదని విమర్శించింది.













