టిక్ టాక్ యాప్ కు షాక్ ఇచ్చిన అమెరికా
చైనా సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌కు యూత్ లో ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉంది. తమ టాలెంట్‌ను ప్రదర్శించడానికి చాలామంది దీన్ని ఓ సాధనంగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా టిక్ టాక్ యాప్ కు షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఏకంగా రూ.40.6 కోట్ల జరిమానా విధించింది. అమెరికా మార్కెట్ లోకి అడుగుపెట్టిన టిక్ టాక్ యాప్ మ్యూజికల్.ఎల్వై అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం కొద్దికాలానికే అమెరికాలో అండ్రాయిడ్ మార్కెట్లో నాలుగో స్థానం, ఐవోఎస్ ప్లాట్ ఫామ్ లో 25వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే 13 ఏళ్లలోపు చిన్నారుల వ్యక్తిగత వివరాలను (పేర్లు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలు) బహిర్గతం చేయడం ద్వారా టిక్ టాక్ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని అమెరికాకు చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీని దోషిగా తేలుస్తూ ఏకంగా రూ.40.6 కోట్ల జరిమానా విధించింది.













