US Work Permits: వేలాది మంది భారతీయులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు.. వర్క్ పర్మిట్ల ఆటోమేటిెక్ రెన్యూవల్స్ రద్దు..
వలసదారులకు మరో షాకింగ్ న్యూస్.. ఇన్నాళ్లు అమలవుతున్న వర్క్ పర్మిట్ విధానంలో కఠిన మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది ట్రంప్ సర్కార్. వలసదారుల పని అనుమతులను (US Work Permits) ఆటోమేటిక్‌గా రెన్యువల్ చేసే విధానానికి ముగింపు పలికింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. దీంతో వేలాది మంది విదేశీయులు ముఖ్యంగా భారతీయులు (Indians in US) తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
‘‘అక్టోబరు 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్లను (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్) పునరుద్ధరించుకునేందుకు దరఖాస్తు చేసుకునే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదు. అయితే ఈ తేదీ కంటే ముందు పని అనుమతులను పొడిగించుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తమ ప్రకటనలో వెల్లడించింది. ప్రజా భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపింది.
గతంలో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వలసదారులు తమ వర్క్ పర్మిట్ (US Work Permits) కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది. ఈ విధానానికి ముగింపు పలుకుతూ తాజాగా ట్రంప్ సర్కారు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పని అనుమతుల పొడిగింపు కోసం వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అగ్రరాజ్య అధికారులు స్పష్టం చేశారు. ‘‘ ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ల (EAD) రెన్యువల్ కోసం దరఖాస్తులను వలసదారులు ఎంత ఆలస్యం చేస్తే వారికి అంత నష్టం. ఒక్కోసారి తాత్కాలికంగా పని అనుమతులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వర్క్ పర్మిట్ల గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తులు సమర్పిస్తే మంచిది’’ అని USCIS సూచించింది. అమెరికాలో ఉద్యోగం అనేది ఒక అవకాశం మాత్రమేనని, వలసదారుల హక్కు కాదని USCIS డైరెక్టర్ జోసెఫ్ అన్నారు.
ఏంటీ EAD?
ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) అనేది ఓ వ్యక్తికి నిర్దిష్ట కాల వ్యవధి వరకు అమెరికాలో పనిచేసేందుకు అధికారం ఉందని నిరూపించే పత్రం. ఇది ఉంటేనే వలసదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతులు లభిస్తాయి. అయితే, గ్రీన్‌కార్డుతో శాశ్వత నివాసం పొందిన వారు ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. హెచ్-1బీ, ఎల్-1బీ, ఓ, పీ వంటి నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ ఉన్నవారికి కూడా ఈ అనుమతులు అవసరం లేదు. గ్రీన్‌కార్డు పెండింగ్‌లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, ఎఫ్-1, ఎం-1 వీసాలపై వచ్చే విద్యార్థుల, డిపెండెంట్ వీసాలపై వచ్చేవారు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఈ EAD పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.







