ఐక్యరాజ్యసమితిలో ఎమర్జెన్సీ
నిధుల లేమితో అవస్థపడుతున్న ఐక్యరాజ్యసమితి గడ్డు పరిస్థితుల నుంచి గట్టేక్కే క్రమంలో మునుపెన్నడూ లేని స్థాయిలో పొదుపు చర్యలు చేపడుతోంది. నియమకాలను తగ్గించటమే కాకుండా.. రోజువారీ వ్యవహారాల్లోనూ సాధ్యమైనంతగా పొదుపు పాటిస్తోంది. ఎస్కలేటర్లు వాడద్దనీ, ఏసీ వినియోగం తగ్గించాలని తాజాగా ఐక్యరాజ్యసమితి ఉద్యోగులకు సూచనలందాయి. పరిస్థితులు మెరుగు పడే వరకూ ఈ రూల్స్ అమల్లో ఉంటాయని యూఎన్ సెక్రెటరీ పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ఇంతటి క్లిష్ట పరిస్థితి మరోటి లేదు అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సభ్యదేశాలు సకాలంలో ఐక్యరాజ్యసమితికి తమ వాటా ప్రకారం నిధులు చెల్లించకపోవటంతో ఈ సమస్య వచ్చిపడింది.
65 సభ్యదేశాలు 1.38 బిలియన్ డాలర్ల మేర యూఎన్కు బాకీపడ్డాయి. ఇవి ఐక్యరాజ్యసమితికి వెంటనే డబ్బు విడుదల చేయకపోతే డిసెంబర్ నాటికి ఉద్యోగులకు జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని యూఎన్ సెక్రెటరీ ఇటీవలే సభ్యదేశాలకు లేఖలు రాశారు.













