ATA: ఆటా వేడుకల గ్రాండ్ ఫినాలే.. విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న బృందం
హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో డిసెంబర్ 12 నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ఆటా వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ వేడుకల చివరి అంకమైన గ్రాండ్ ఫినాలే రేపు (డిసెంబర్ 27) రవీంద్ర భారతిలో ఘనంగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్ ను విజయవంతం చేయడానికి ఆటా నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది.
నిరంతర కృషితో ముందుకు
గత పక్షం రోజులుగా సుమారు 25 మంది ఆటా ప్రతినిధులు తమ వ్యక్తిగత వృత్తులను, వ్యాపారాలను, కుటుంబాలను పక్కన పెట్టి తెలుగు గడ్డపై సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, బిజినెస్ సెమినార్లను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఒక కొత్త ఊరిలో కార్యక్రమం చేపడుతూ, ఒకదానిని మించి మరొకటి విజయవంతం అయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. రేపు జరగబోయే గ్రాండ్ ఫినాలే ఏర్పాట్లపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి రామసహాయం ప్రత్యేక దృష్టి సారించారు. వీరు ఇతర నాయకులతో కలిసి ఒక కార్యాలయంలో సమావేశమై, కార్యక్రమ సమన్వయం, ప్లానింగ్ పై సుదీర్ఘంగా చర్చించారు.
భవిష్యత్ లక్ష్యాల దిశగా…
ప్రస్తుత వేడుకలతో పాటు, 2026 జూలైలో అమెరికాలోని బాల్టిమోర్ లో జరగబోయే 19వ ఆటా మహాసభల కోసం కూడా ఈ బృందం ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తోంది. ఈ మహాసభలకు ముఖ్య అతిథులను ఆహ్వానించడం, వ్యాపారవేత్తలను స్పాన్సర్లుగా చేర్చుకోవడం వంటి కీలక బాధ్యతలను వారు నిర్వహిస్తున్నారు. గ్రాండ్ ఫినాలే విజయవంతంగా జరిగేందుకు అందరూ ఓ ఆఫీసులో సమావేశం అయి ప్లానింగ్ చేసుకోవటం తెలుగు టైమ్స్ కి కనిపించింది. మాతృభూమిపై మమకారంతో తెలుగు భాషా సంస్కృతుల కోసం శ్రమిస్తున్న ఆటా బృందానికి తెలుగు టైమ్స్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తోంది.






