TANA: ఎల్బ్రస్ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకం

రష్యాలోని ఎల్బ్రస్ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకంను తానా బోర్డ్ డైరెక్టర్లు నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, జానీ నిమ్మలపూడి రష్యాలోని ఏడు శిఖరాల్లో అత్యంత ఎత్తైన పర్వతమైన ఎల్బ్రస్ శిఖరం (Mount Elbrus) పై ఎగురవేశారు. అమెరికాలో మొట్టమొదటిసారిగా వాల్మీకి రామాయణం తెలుగులో బోధించడానికి తానా సన్నాహాలను పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ పతాకాన్ని ఎగురవేసి తానా (TANA) చేస్తున్న కార్యక్రమాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చారు.
విశ్వ గురుకులంలో వాల్మీకి రామాయణం తరగతులు సెప్టెంబర్ నుంచి మొదలవుతున్నాయి. ధర్మం అంటే కర్తవ్యాలను నిబద్ధతతో, నైతికతతో నిర్వహించడం. ఈ ధర్మగుణాలను నేటి తరం వారికి అందించాలనే ఉద్దేశ్యంతో రామాయణం వంటి ఇతిహాసాల్లోని విలువలను పరిచయం చేసే కథా ప్రయాణం ఇది అని తానా నాయకులు తెలిపారు. 5-14 వయస్సుకల పిల్లలకు ఒక సెషన్, 14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు మరో సెషన్ ఏర్పాటు చేశారు. అలాగే 18 సంవత్సరాల వయస్సుకలవారికి నేటి జీవనవిధానానికి రామాయణ పాఠాలను నేర్పనున్నారు. ఇలా మంచి విషయాలను బోధించే ఈ విశ్వగురుకులంలో చేరాల్సిందిగా తానా నాయకులు తెలుగుకమ్యూనిటికి విఙప్తి చేశారు. ఆసక్తి గలవారు ఇక్కడ https://events.tana.org/event/viswa-gurukulam-2025 నమోదు చేసుకోగలరు.